భారత ప్రజలు ఉచితాలకు ఓట్లేస్తున్నారా?. అవునని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. అందుకే ఇష్టం వచ్చినట్లుగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఉచితాలకు వ్యతిరేకం అనే బీజేపీ కూడా మైండ్ బ్లాంకయ్యే ఉచితాలను ప్రకటించింది. అభ్యుదయ రాజకీయంతో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందులో మాస్టర్స్ చేసింది. లాటరీ తగులుతుంది కదా అని కాంగ్రెస్ గ్యారంటీల్ని ప్రకటించేసింది. అంటే అందరూ ఉచితాల ఆఫర్లు ఇచ్చారు. ఇంచూమించూ ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం, ఉచితంగా డబ్బుల పథకాలు కామన్. కానీ వాటిని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారా?
ఓటేయడానికి ఓటర్ల ప్రయారిటీ మేనిఫెస్టోలు కాదు !
ఓట్లు వేయడానికి ఓటర్లు రాజకీయ పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోలను చూస్తున్నారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకులు ఉండరు. సగం మంది ఓటర్లకు మేనిఫెస్టో అంటే తెలియదు. మిగిలిన సగం మందికి అసలు ఆ పథకాల అమలు అవుతాయని కూడా అనుకోరు. ప్రజలు ఓటింగ్ ప్రయారిటీలో మేనిఫెస్టో లేదా పార్టీలు ఇచ్చే వరాలు అనేదానికి లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. హామీలను చూసి ఎవరూ ఓట్లు వేయరు. ప్రజలకూ అవగాహన పెరుగుతోంది. తాము పన్నులుగా కట్టిన డబ్బులు లేదా.. పన్నులు పిండేయడం ద్వారా వచ్చే డబ్బులు ఇంకా కాకపోతే తమను తాకట్టు పెట్టి చేస్తున్న అప్పులతో పథకాలు అమలు చేస్తున్నారని క్లారిటీకి వస్తున్నారు.
ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ఓటింగ్ !
ఓ ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ ప్రభుత్వం తమకు డబ్బులు ఇచ్చిందా లేదా అన్నది చూసుకోరు. సంక్షేమం అవసరమైన వారికి అందుతూనే ఉంటుంది.కానీ అవసరం లేకపోయినా ఓటు బ్యాంక్ కోసం పథకాల్ని అమలు చేస్తే మెజార్టీ ప్రజల వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అంటే స్కీములు వల్లనే ఎక్కువ వ్యతిరేకత పెరుగుతుంది. పాలనలో సరైన ప్రాధాన్యత లేక.. అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేక చేస్తున్న రాజకీయంతో ఆయా పార్టీలు చులకన అవుతున్నాయి. చివరికి ఘోరంగా ఓటమి పాలవుతున్నాయి.
అన్ని పార్టీలూ ఉచిత హామీలు ఆపేసినా ఓట్లేస్తారు !
రాజకీయ పార్టీలు ఇప్పటికిప్పుడు కూడబలుక్కుని మేనిఫెస్టోలను రద్దు చేసుకున్నా ప్రజలు ఓట్లేస్తారు. ఎవరు మంచిపాలన అందిస్తారని నమ్మకం ఉంటే వారికి ఓట్లేస్తారు. రాజకీయ పార్టీలు ఈ దిశగా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి కానీ ఉచితాలు ఇస్తామని కాదు. ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను గుర్తించి అయినా పార్టీలు మారాల్సిఉంది. అన్ని పార్టీలు ఉచిత హమీలు ఇస్తున్నాయి. గెలిచిన పార్టీ హామీల వల్లే గెలిచామని అనుకుంటోంది. కానీ మిగతా పార్టీలు కూడా హామీలు ఇచ్చినా గెలవలేదు. అంటే.. ఏంటి అర్థం ?. ప్రజల ప్రయారిటీ వేరు. ఉచితాలు ఆపేసి.. అవసరమైన వారికి మాత్రమే సంక్షేమం ఇచ్చి డబ్బుల విలువను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాజకీయ పార్టీలు ఆలోచించాలి.