దర్శకుడే కెప్టెన్. సినిమాకు తనే సూత్రధారి. హీరోల ఆధిపత్యం ఉధృతంగా కొసాగుతున్న రోజుల్లో కూడా దర్శకుడిగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకొన్నారు దాసరి. హీరో ఎవరైనా సరే ‘ఇది దాసరి సినిమా’ అనిపించుకొన్నారు. దర్శకుడనేవాడు ఎలా ఉండాలి? అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచారు. సెట్లో దర్శకుడి మాటే నెగ్గాలి.. అనుకొనే తత్వం దాసరికి ముందు నుంచీ ఉంది. తన తొలి సినిమా ‘తాత – మనవడు’తోనే అది చూపించుకోగలిగారు దాసరి.
‘తాత మనవడు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు దాసరి. అందులో తాతగా ఎస్వీఆర్, మనవడిగా రాజబాబు నటించారు. ఎస్వీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆయన స్టార్లకే స్టార్. సెట్లో ఆయన అడుగు పెట్టాడంటే – అంతటా నిశ్శబ్దం. డైలాగ్ చెప్పాడంటే కెమెరా కూడా షేక్ అయిపోవాల్సిందే. పెద్ద పెద్ద దర్శకులు కూడా ఎస్వీఆర్ మనసుకు, ఆయన మూడ్ కు తగ్గట్టుగా నడుచుకొంటారు. అలాంటి నటుడ్ని తొలి సినిమాతోనే డీల్ చేయాల్సివచ్చింది దాసరికి.
సినిమాలో కీలకమైన సన్నివేశం అది. దాదాపుగా ప్రధాన పాత్రధారులంతా ఆ సీన్లో ఉంటారు. ఎస్వీఆర్కు ఓ పెద్ద డైలాగ్ రాశారు దాసరి. అది దాదాపు పది పేజీలు ఉంటుంది. దాసరి సహాయకుడు రేలంగి నరసింహారావు… ఆ డైలాగ్ పేపర్ని ఎస్వీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. ‘నేను చదవను కానీ.. నువ్వే చదివి వినిపించు’ అన్నారు ఎస్వీఆర్. రేలంగి ఆ డైలాగ్ పేపర్ ని చదువుకొంటూ వెళ్తుంటే.. ఎస్వీఆర్ మనసులోనే మననం చేసుకొంటూ.. ‘ఈ డైలాగ్ ఇక్కడ కట్ చేయ్.. ఇది తీసేయ్’ అంటూ ఎడిట్ చేసుకొంటూ.. చేసుకొంటూ పది పేజీల డైలాగ్ ని కాస్త 3 పేజీలకు కుదించారు. ‘ఆ.. మేటర్ అంతా ఈ మూడు పేజీల్లో కన్వే అవుతుంది లే.. వెళ్లి మీ డైరెక్టర్‌కి చెప్పు’ అన్నారు. ఇదే వార్త దాసరి దగ్గరకు మోసుకొని వెళ్లారు రేలంగి.
వెంటనే దాసరి ఎస్వీఆర్ దగ్గరకు వెళ్లారు. ”పది పేజీల డైలాగ్ మూడు పేజీలకు బాగా కుదించారు.. కానీ ఈ సీన్లో ఈ డైలాగులన్నీ అవసరమే. నటుడిగా మీకు ఈ సీన్ మాత్రమే తెలుసు. నాకు ఈ సీన్‌కు ముందు జరిగే కథ, తరవాత జరగబోయే కథ కూడా తెలుసు. కాబట్టి.. పది పేజీల డైలాగులూ చెప్పాల్సిందే” అని సున్నితంగా వివరణ ఇచ్చారు.
దాంతో ఎస్వీఆర్కు కోపం వచ్చింది. చేతిలో స్టిక్ ఉంటే.. దాన్ని విసిరి కొడుతూ ‘రైటర్లు దర్శకులైతే ఇదే తలనొప్పి..’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. షూటింగ్ జరుగుతుండగా ఎస్వీఆర్ వెళ్లిపోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది. నిర్మాత రాఘవకు ఇంకాస్త కంగారు వచ్చింది. ఎస్వీఆర్‌ని ఆపే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. ”ఏంటయ్యా నారాయణరావూ.. ఇలా చేశావ్.. పెద్ద వాళ్ల మనసుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. పైగా ఇది నీ తొలి సినిమా” అంటూ మందలించారు.
కట్ చేస్తే.. కార్లో వెళ్లిపోయిన ఎస్వీఆర్, మనసు మార్చుకొని ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చారు. రేలంగిని పిలిచి..”ఆ డైలాగ్ పేపర్ ఇవ్వు.. పది పేజీల డైలాగ్ ఇస్తే నేను చెప్పలేను అనుకొంటున్నాడా మీ డైరెక్టరు? పది పేజీలేంటి, ఇరవై పేజీల డైలాగ్ అయినా చెప్పేస్తా” అంటూ.. టక టక ఆ డైలాగ్ ని మననం చేసుకొని, ఒకే షాట్ లో చెప్పి ‘ఓకే’ చేయించుకొన్నారు. ఎస్వీఆర్ కమిట్ మెంట్ కి సెట్ అంతా నిర్ఘాంతపోయింది.
ఆ రోజు పేకప్ అయిపోయి, ఇంటికి వెళ్లిపోతూ.. వెళ్లిపోతూ.. దాసరిని పిలిచారు ఎస్వీఆర్. ”భలేవాడివయ్యా డైరెక్టరూ.. నువ్వు అనుకొన్నదే జరిపించుకొన్నావు. దర్శకుడంటే అలా ఉండాలి.. పైకొస్తావ్” అంటూ దీవించి వెళ్లిపోయారు.