ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు.. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాంలో ప్రసంగించిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురయిందన్నారు. అయితే ఎంత విధ్వంసానికి గురయిందో అంతకు మూడింతలు సాయం చేసి ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబుకు సహకరిస్తామన్నారు.
అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మోదీ ప్రభుత్వం రాగానే రూ. 27 వేల కోట్లను హడ్కో, ప్రపంచ బ్యాంక్ ద్వారా అందించామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో నీళ్లను 2028కల్లా పారిస్తామని భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం కావాల్సినంత సాయం చేస్తుందన్నారు. అమిత్ షా ప్రసంగం అంతా ఉత్సాహంగా సాగింది. తన ప్రసంగంలో చంద్రబాబు ఏయే అంశాలను ప్రస్తావించారో వాటన్నింటికీ భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే మూడు లక్షల కోట్ల వరకూ ప్రాజెక్టులు, సాయం అందించామన్నారు.
అంతకు ముందు చంద్రబాబు ప్రసంగంలో ఏపీ వెంటిలేటర్ నుంచి బయటపడినా ఇంకా పేషంట్ గానే ఉంది. ఇటీవలి కాలంలో అమరావతి, పోలవరంకు చేసిన సాయంతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సహకారం ఇలా కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. భారత్ గ్లోబల్ లీడర్ కావాల్సి ఉంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డేటా సైన్స్ రంగాల్లో దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్ నెంబర్ వన్ అవుతుంది. ఎవరూ ఆపలేరన్నారు. గత ఆరు నెలల కాలంలో కేంద్రం ఎంతో సహకరిచిందని కీలకమైన ప్రాజెక్టుల్ని కేటాయించారని అన్నారు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.