నిజామాబాద్‌కు రాదు అనుకున్న పసుపుబోర్డు రావడంతో ఇప్పుడు రాజకీయం అంతా ఆ బోర్డు చుట్టే తిరుగుతోంది. క్రెడిట్ సహజంగా ఎంపీ అర్వింద్ కు దక్కుతోంది. ఆయనే మొదటి సారి గెల్చినప్పుడు బాండ్ కూడా రాసిచ్చారు. అయితే కాస్త ఆలస్యమైనా ఇప్పటికి పసుపు రైతుల డిమాండ్ నెరవేరింది. అయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో పసుపుబోర్డు హామీ ఇచ్చే చేయలేకపోయిన కవిత.. ఇప్పుడు తానే అసలు పోరాడాననే సంగతిని గుర్తు చేస్తున్నారు. వీకెండ్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమె.. ఈ ఆదివారం కూడా అలాంటి టూర్ పెట్టుకున్నారు.
నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె ఎంపీ అర్వింద్ పై మండిపడ్డారు. ఎంపీ అరవింద్ స్పైసెస్ బోర్డు బెంజ్ కారు.. పసుపుబోర్డు అంబాసిడర్ కారు అన్నారు. ఇప్పుడు బెంజ్ కారు కాకుండా అంబాసిడర్ కారు ఎందుకు వచ్చిందిని ప్రశ్నించారు. తాను ఎంపీ అయిన తర్వాత కేంద్రానికి చాలా సార్లు విజ్ఞప్తి చేశానని దేశంలో పాతిక రాష్ట్రాలకుపైగా ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. పార్లమెంట్ లో కూడా ప్రైవేటు బిల్లు పెట్టానన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయగానే కుదరదని రూ. పదిహేను వేల మద్దతు ధర ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు.
కవిత ఎంపీగా ఓడిపోయిన తర్వాత నిజమాబాద్‌లో రాజకీయంగా ఉద్రిక్తత ఉండేది. ఎంపీ అర్వింద్ ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేవి. దాడులు చేసేవి. పసుపబోర్డు పేరుతో బాండ్ రాసిచ్చి అమలు చేయలేదని దాడులకు దిగేవారు. అయితే రెండో సారి కూడా అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎవరూ మాట్లాడలేకపోయారు. అప్పటికే కవిత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల సమయంలో జైల్లో ఉన్నారు.