సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశీయుడుగా గుర్తించారు. అతను దేశంలోకి అక్రమంగా చొరబడ్డాడని ముంబైలో దొంగతనాలకు అలవాటుపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. సైఫ్ అపార్టుమెంట్లో లభించిన సీసీ ఫుటేజీ ఆధారంగా మొదటగా ప్లంబర్ ను అదుపులోకి తీసుకున్నారు.కానీ అతను కాదని తెలియడంతో వెంటనే వదిలేశారు. తర్వాత చత్తీస్ ఘడ్ లో అరెస్టు చేశారన్న ప్రచారం జరిగింగి. కానీ పోలీసులు ముంబైలోనే అరెస్టు చేశామని థానేలో ఉండగా పట్టుకున్నామని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
ఐదు రోజుల పాటు కస్టడీకి కావాలని అడగడంతో కోర్టు అంగీకరించింది. ఐదు రోజుల్లో పోలీసులు అసలు సైఫ్ పై దాడి చేయడానికి కారణాలేమిటో తెలుసుకోనున్నారు. పూర్తి స్థాయిలో దొంగతనం కోసమే వచ్చాడని అది సైఫ్ అలీ ఖాన్ అనే యాక్టర్ ఇల్లు అనే సంగతి అతనికి తెలియదని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించేందుకు ఏర్పాటు చేసిన మెట్ల గుండా అతను పై అంతస్తుల్లోకి వచ్చాడు. మొదటగా సైఫ్ చిన్నకుమారుడి గదిలోకి అడుగు పెట్టాడు. అక్కడ పనిమనిషి అరవడంతో. అప్పుడు సైఫ్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో దాడి జరిగింది.
సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఆయనకు తొలి రోజు సర్జరీ చేశారు. రెండో రోజు జనరల్ రూమ్ లోకి మార్చారు. మరో వారం రోజుల పాటు ఆయనను ఎవర్నీ కలవనీయకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత సైఫ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.