తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌ను ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు వినిపిస్తున్నారు. సీనియర్ నేతలు సహా అందరూ ఒకే మాట మీదకు వస్తున్నారు. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలి. ఇందులో జనసేన పార్టీకి సంబంధం లేదు. అయితే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేస్తే అది పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసినట్లేనని కొంత మంది విశ్లేషిస్తున్నారు. జనేసన సోషల్ మీడియా కూడా అదే అభిప్రాయంతో ఉంది. నిజానికి ఇందులో జనసేన పార్టీపై ప్రభావం చూపించే అంశమే లేదు.
పేరు లేదు కానీ డిప్యూటీ సీఎంలానే లోకేష్ విధులు
నారా లోకేష్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది టీడీపీ నేతలు డిసైడ్ చేసుకుంటారు. అయితే ఇప్పటి వరకూ నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాకపోయినా ఆ స్థాయిలో పవర్ ఫుల్ పోషిస్తున్నారు. మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. తన శాఖలు కాకపోయినా ఆయన కొన్ని పనులు చేస్తున్నారు. పెట్టుబడుల వ్యవహారంతో ఆయనకు సంబంధం లేదు కానీ ఆయనే ముందు ఉంటున్నారు. చంద్రబాబు కీలక అంశాల విషయంలోనే జోక్యం చేసుకుంటున్నారు. మిగతా కింది స్థాయి పాలన అంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతోంది. అందుకే పేరు లేకపోయినా.. ఆయన డిప్యూటీ సీఎంగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
అధికారికంగా పదవి ఇస్తే తదుపరి నాయకత్వమన్న సంకేతాలు
తమిళనాడులో ఉదయనిధిని స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ కారణంగా ఆయనే తర్వాత డీఎంకే వారసుడు అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇదే అభిప్రాయాన్ని ఏపీలో కూడా కల్పించేలా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలంటున్నారు ఇది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీకి , ప్రభుత్వానికి తదుపరి నాయకత్వం అన్న సంకేతాలను పంపాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు.
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే జనసేనపై ఎలాంటి ప్రభావం ఉండదు !
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడం వల్ల పవన్ కు ప్రాబ్లం అవుతుందని కొంత మంది చెబుతున్నారు, విశ్లేషిస్తున్నారు. కానీ జనసేన పార్టీ మిత్రపక్షం. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పూర్తి స్థాయి పవర్ లో ఉన్నారు. గతంలో జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించినా వారి పేర్లు కూడాచాలా మందికి గుర్తు ఉండవు. కానీ పవన్ కల్యాణ్‌ది పవర్ ఫుల్ రోల్. మరో డిప్యూటీ సీఎం ఉన్నా ఆయన పాత్ర ఏ మాత్రం తగ్గదు. అలాగే జనసేన పార్టీపై ప్రభావం ఉండదు. టీడీపీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించుంటోంది. అనుకోవడం తప్ప జనసేనపై ఎలాంటి ప్రభావం ఉండదు. పవన్ కల్యణ్కు దీనిపై స్పష్టత ఉంటుందని అనుకోవచ్చు.