కుటుంబ కథా చిత్రాలకు ఎప్పటికీ గిరాకీ ఉంటుందని నిరూపించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా… సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. వెంకటేష్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది. సంక్రాంతి సినిమాల్లో లాంగ్ రన్… దీనికే. అనిల్ రావిపూడికి ఇది వరుసగా 8వ విజయం. గేమ్ చేంజర్ సినిమాతో దెబ్బతిన్న దిల్ రాజుకు గొప్ప ఊరట ఇచ్చిన విజయం ఇది.
అయితే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ గొప్ప కథేం కాదు. స్క్రీన్ ప్లే జిమ్మిక్కులూ ఏం ఉండవు. సున్నితమైన హాస్యం (బుడ్డోడు బూతులు తిట్టడం మినహాయిస్తే)తో, సరదా సన్నివేశాలతో నిండిపోయిన సినిమా ఇది. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉన్న సినిమా. అందుకే ఇంత ఆదరణ. సంక్రాంతి లాంటి పండగ వచ్చినప్పుడు, ఇంటిల్లిపాదీ ఏదో పిక్నిక్కి వెళ్లినట్టు వెళ్లగలిగేంత ఆనందంగా థియేటర్లకు వెళ్తున్నారు. నిజానికి కొంతకాలంగా ఫ్యామిలీ కథలు రావడం లేదు. పెద్ద స్టార్లు, బడా బడా దర్శకులు ‘వరల్డ్ బిల్డింగ్’ పేరుతో ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. సినిమాని యాక్షన్లో ముంచి తేలుస్తున్నారు. రక్తపాతం మితిమీరిపోతోంది. ‘ఇక మీదట అన్నీ ఇలాంటి సినిమాలే వస్తాయేమో..’ అని బెంగ పడుతున్న టైమ్ లో.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రావడం పెద్ద రిలీఫ్ గా అనిపించి ఉండొచ్చు.
ఇది వరకు మాస్ మసాలా, యాక్షన్ సినిమాలు ఎన్ని వచ్చినా, మధ్యమధ్యలో ఫ్యామిలీ డ్రామాలు మెరిసేవి. ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ లాంటి దర్శకులు కుటుంబ కథలకు పెద్ద పీట వేసేవారు. అవి హిట్లూ అయ్యేవి. అయితే రాను రాను.. ఈతరహా కథల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేశారు. పాన్ ఇండియా మోజులో అవన్నీ అటకెక్కేశాయి. ‘ఇలాంటి కథలు ఇక చూడరు’ అని ఎవరికి వాళ్లే నిర్ణయాలకు వచ్చేశారు. అందుకే.. కుటుంబ కథా చిత్రాలు తగ్గిపోయాయి. ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం` విజయంతో వాటికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ కు ఓ సూపర్ హిట్ రాగానే, ఆ జోనర్లో సినిమాల్ని వరుస పెట్టి దించేస్తుంటారు. హారర్ సినిమా బాగా ఆడితే, ఆ తరవాత కనీసం పది దెయ్యం కథలు సెట్స్ పైకి వెళ్లిపోతాయి. అదే సెంటిమెంట్ ఇప్పుడు ఫ్యామిలీ కథలకూ వర్తించే అవకాశం ఉంది. దర్శకులు, రచయితలూ తమ దగ్గరున్న కుటుంబ కథా చిత్రాల దుమ్ము దులిపి, బయటకు తీయాల్సిన టైమ్ ఇది. కాకపోతే.. రిలీజ్ డేట్ కూడా గట్టిగా ప్లాన్ చేసుకోవాలి. సంక్రాంతి లాంటి సీజన్లో వాటిని విడుదల చేసుకోగలిగితే.. తిరుగుండదు. బహుశా… రాబోయే ప్రతీ సంక్రాంతికీ ఓ ఫ్యామిలీ డ్రామా ఉండడం ఇక నుంచి రివాజుగా మారుతుందేమో..?