రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యలు దారి తప్పి చాలా కాలం అయింది. పార్టీ లైన్ లో పని చేసేవారు కొందరు ఉంటే అభిమానం కోసం పని చేస్తున్నామని చెప్పుకుని చెలరేగిపోయేవారు కొందరు. తమ పార్టీ అధినేతల్ని పొగుడుకుంటే ఎవరికీ సమస్య ఉండదు. కానీ పక్క పార్టీ అధినేతల్ని.. వ్యక్తిగతంగా దూషించడం, వారి కుటుంబాలపై వ్యాఖ్యలు చేయడం కూడా తాము తమ పార్టీపై చూపిస్తున్న అభిమానం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వారు తమ అధినేతల్ని ఇతరుల చేత ఘోరంగా తిట్టిస్తున్నారు.
జనసేన, టీడీపీ సోషల్ మీడియాలు ఇప్పుడు అదే పని చేస్తున్నాయి. తమ మధ్య ఉన్న ఈగో సమస్యలకు.. పార్టీ పెద్దలను తెస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరో టీడీపీ కార్యకర్త ఏదో అన్నారని చంద్రబాబును, ఎన్టీఆర్ ను నానా మాటలు అనడం ప్రారంభించారు. దానికి కౌంటర్ గా టీడీపీ కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను తిట్టడం ప్రారంభించారు. వీరి ఫ్యాన్ వార్ తో సోషల్ మీడియా కలుషితం అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అటు టీడీపీ వాళ్లు కానీ.. ఇటు జనసేన వాళ్లు కానీ తమను తాము తిట్టుకోరు. చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టిస్తూ ఉంటారు.
అధికారంలో ఉన్న పార్టీలకు ఓ పెద్ద సమస్య ఉంటుంది. తామే పెద్ద అభిమానస్తులం అని చెప్పుకోవడానికి గీత దాటిపోతూంటారు. అధికార పార్టీలం కాబట్టి తమ పైకేసులు ఉండవని తిట్టుకుంటూ ఉంటారు. నిజానికి వీరు చేసే వ్యవహారాల వల్ల వారిసొంత పార్టీలకు ఎలాంటి మేలు జరగదు సరి కదా.. అధినేతల్ని ఘోరంగా తిట్టిస్తూ ఉంటారు. నిజంగా అభిమానం ఉంటే.. ఇలా తిట్టించరని ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఈ సోషల్మీడియా సైన్యాల రూటే వేరు. వారికి పార్టీ అధినేతల గౌరవంకాపాడటం కన్నా… తమ ఈగోలతో మరింతగా తిట్టించేందుకు సిద్దపడతారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఏ పార్టీకైనా సమస్యే.