పెద్ద అంబర్పేట్, ఘట్కేసర్, బాలాపూర్ మండలాల పరిధిలో.. భూ సమీకరణ పథకం కింద 515 ఎకరాల్లో భారీ లేఅవుట్లను చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొర్రెముల, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్, కుర్మల్‌గూడ, నాదర్గుల్ ప్రాంతాల్లో లేఅవుట్లు వేయనున్నారు. ఇందు కోసం భూముల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
హెచ్ఎండీఏ అనుమతులు ఉంటే చాలు అనుకుంటారు వినియోగదారులు. నేరుగా హెచ్ఎండీఏనే అమ్మితే ఇక కావాల్సింది ఏముంది. భూ యజమానులు తమ స్థలాలను అభివృద్ధి చేయడానికి రియల్ ఎస్టేట్ సంస్థలను ఆశ్రయిస్తూంటారు. తామే కొన్నింటినీ అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందని హెచ్ఎండీఏ భావించి నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌కు.. భూసమీకరణ పథకం కిందనే రైతుల నుంచి భూములను సేకరించారు. అభివృద్ధి చేసిన లేఅవుట్లో విలువైన స్థలాలను రైతులకు అందించారు. అది మంచి ఫలితాలను ఇచ్చింది.
అబ్దుల్లాపూర్‌మెట్ , ఘట్కేసర్, బాలాపూర్ మండల్లాలో 515 ఎకరాల భూములిచ్చేందుకు రైతులు అంగీకరించడంతో ఆయా సర్వే నెంబర్ల ఆధారంగా అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఐదు ప్రాంతాల్లో నాలుగు భారీ లేఅవుట్లు వేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లేఅవుట్లను 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ లేఅవుట్లకు 100 అడుగుల అప్రోచ్ రోడ్డు ఉండేందుకు చర్యలు చేపట్టనున్నారు. తర్వాత వీటిని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు వేలం వేసే అవకాశం ఉంది.