సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకొంటూ వెళ్తున్నాడు బాబీ. ఇది వరకు కూడా బాబీ హిట్స్ కొట్టాడు. కానీ.. ఎక్కడో తన సినిమాలు పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయాయి. ఎన్టీఆర్ తో చేసిన ‘జై లవకుశ’ హిట్టయినా, నూటికి నూరుశాతం సంతృప్తి దక్కలేదు. వాల్తేరు వీరయ్యతో మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ తో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొన్నాడు. ఈ విజయాలతో బాబీ టాప్ లీగ్ లోకి చేరిపోయినట్టే.
డాకూ తరవాత బాబీ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతిలో సూపర్ హిట్స్ ఉన్నా, పెద్ద హీరోలు అందుబాటులో లేరు. ఇది వరకు రజనీకాంత్ తో బాబీ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు రజనీ డేట్లు దొరకడం కష్టం. చిరంజీవి – బాబీ కాంబోలో మరో సినిమా వస్తుందని చెప్పుకొంటున్నారు. ‘విశ్వంభర’ తరవాత చిరు అనిల్ రావిపూడితో సినిమా చేయాల్సివుంది. దాదాపుగా ఈ కాంబో ఖాయం. ఇదే సమయంలో బాబీతోనూ చిరు సమాంతరంగా ఓ సినిమా చేస్తారని, రెండు సినిమాలకూ డేట్లు సర్దుబాటు చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ సంక్రాంతికి హిట్లు కొట్టిన ఇద్దరు దర్శకుల్నీ.. చిరు లైన్లో పెట్టేసినట్టే. చిరు ఏక కాలంలో ఒకే సినిమా చేయాలని అనుకొంటే మాత్రం – బాబీ మరో హీరోని పట్టుకోవాలి. చిరు లాంటి స్టార్ హీరో కావాలంటే బాబీ కొంతకాలం ఎదురు చూడక తప్పదు. బాబీ కూడా ఇప్పుడు తొందర తొందరగా సినిమా చేసేయాలన్న ఉద్దేశంతో లేడు. ప్రస్తుతానికి డాకూ హిట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తరవాతే… కథ గురించీ, హీరో గురించి ఆలోచిస్తానంటున్నాడు బాబీ.