సర్దార్ గబ్బర్ సింగ్‌కి దర్శకుడగానే బాబి ఎంత పొంగిపోయాడో, ఆ రిజల్ట్ బయటకు వచ్చాక అంత కృంగిపోయాడు. సర్దార్ ఎఫెక్ట్ బాబీపై భారీగానే పడింది. ఆ సినిమా విడుదలయ్యాక మీడియా కంటికి కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు రవితేజ దగ్గర తేలాడు. రవితేజ – బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని టాక్. డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. రవితేజ – బాబిలు కలసి ఇది వరకు పవర్ తీశారు. అది బాగానే అడింది. బెంగాల్ టైగర్ తరవాత రవితేజకు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. మధ్యలో కొన్ని కథలు విన్నా సెట్ కాలేదు. సెట్ అయిన కథలు అనివార్యకారణాల వల్ల పట్టాలెక్కడం లేదు. దాంతో రవితేజ కూడాకాస్త టెన్షన్ పడ్డాడు.
ఈ దశలో బాబి ఓ కథ వినిపించడం, దానికి రవితేజ ఓకే అనేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. అతి త్వరలో ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది. సర్దార్తో పోయిన పరువు నిలుపోవాలంటే ఈ సినిమాని బాబి హిట్ చేసుకోవాల్సిందే.