అమరావతి నిర్మాణం టెండర్ల దశకు చేరిన సమయంలో సీఆర్డీఏ కమిషనర్ గా ఉన్న కాటమనేని భాస్కర్ ను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆయన కూడా చురుగ్గానే పని చేస్తారు. కానీ మంత్రి నారాయణ వేగం, పనితీరుతో ఆయనకు సింక్ కుదరలేదు. కొంత కాలంగా కాటమనేని భాస్కర్ ను బదిలీ చేయాలని నారాయణ పట్టుబడుతూ వస్తున్నారు. అయితే కొంత కాలం వేచి చూసిన చంద్రబాబు ఇక ఇద్దరూ కలిసి పని చేస్తే సమస్యలు వస్తాయని నిర్ణయానికి రావడంతో కాటమనేని భాస్కర్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ కన్నబాబును నియమించారు.
మంత్రి నారాయణ పని తీరు భిన్నంగా ఉంటుంది. ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తారు. ఆయనతో పని చేసే ఐఏఎస్లకు ఇలా పని చేయడం సాధ్యం కాదు. కానీ నారాయణ వదిలి పెట్టరు. అందుబాటులో ఉండాల్సిందేనంటారు. ఈ క్రమంలో కాటమనేని భాస్కర్ వల్ల నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని నారాయణ సిఎంకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కన్నబాబును కూడా నారాయణ చాయిస్ మేరకే నియమించినట్లుగా తెలుస్తోంది.
నారాయణ టీచర్ గా పని చేసి.. నారాయణ విద్యా సంస్థలను నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ పనిలోనే ఉండాలని అనుకుంటారు. అందరూ అలా ఉండలేరు. ఇప్పుడు కన్నబాబు అయినా ఆయన వేగంతో పోటీ పడటం కష్టమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నారాయణ ఐఏఎస్ అధికారులతో స్మార్ట్ వర్క్ చేయించుకుని వారికి వ్యక్తిగత జీవితం కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అధికార వర్గాలు సలహాలిస్తున్నాయి. మరో వైపు తనను బదిలీ చేయడంపై కాటమనేని భాస్కర్ అసంతృప్తికి గురయి.. దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలని నిర్ణయించుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఆయనకు ప్రాధాన్యత ఉన్న ఐటీ శాఖ బాధ్యతలే ఇచ్చారు. కానీ ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లాలని అనుకుంటున్నారు.