ధరలు పెంచాల్సిందేనని లేకపోతే సరఫరా ఆపేస్తామని బెదిరించిన కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ తెలంగాణ ప్రభుత్వం రివర్స్ లో ఇచ్చిన షాక్తో దిగి రాక తప్పలేదు. ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీరుకోకుండానే.. బీర్ల సరఫరాలను పునరుద్ధరిస్తున్నామని యూబీ కంపెనీ ప్రకటించింది. దీంతో తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు దొరవకని జరిగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లయింది.
మరో నెలకు సరిపడా బీర్లను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ముందుగానే నిల్వ పెట్టుకుంది. అందుకే గత కొద్ది రోజులుగా ఆ బీర్ల ఆర్డర్లు పెట్టకపోయినా ఎక్కడా కొరత రాలేదు. అదే సమయంలో ధరలు పెంచాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న తరహాలో ఆ సంస్థ వ్యవహరించడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కంపెనీల డిమాండ్స్ విషయంలో తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. కొత్త బీర్ల కంపెనీలకు అనుమతులు పారదర్శకంగా ఇవ్వాలన్నారు.
అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కింగ్ ఫిషర్ బీర్లను తెలంగాణలో అందకుండా చేసి.. కాంగ్రెస్ నేతలకు చెందిన బీర్లను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇలాంటి ఆరోపణల్ని సీరియస్ గా తీసుకోలేదు. కొత్త బీర్లకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో కింగ్ ఫిషర్ వెనక్కి తగ్గింది. తెలంగాణ అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక్కడ అమ్ముడయ్యే బీర్లలో అరవై శాతం ఆ కంపెనీవే. అలాంటప్పుడు.. ఆ మార్కెట్ పొరపాటున మిస్సయితే వేరే కంపెనీలు అందిపుచ్చుకుంటాయి. అది కంపెనీ విలువను తగ్గిస్తుంది. అందుకే కింగ్ ఫిషర్.. మెల్లగా తగ్గింది. ప్రభుత్వం అంటే ఈ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చేలా చేసింది.