నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఆ తరవాత కార్తీక్ దండు సినిమా మొదలెడతారు. ‘విరూపాక్ష’తో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నారు కార్తీక్. ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ థ్రిల్లర్ కథ సిద్ధం చేసుకొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నారు. కథానాయికగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల, మీనాక్షి.. ఇలా ఒకొక్కరి పేరు బయటకు వస్తోంది. మీనాక్షి లేదంటే.. శ్రీలీల ఖరారు కావొచ్చు. ఈ సినిమా కోసం ‘వృష కర్మ’ అనే పేరు పరిశీలిస్తున్నారు.
ఇప్పుడు విలన్ కూడా ఫిక్సయినట్టు సమాచారం అందుతోంది. ఈసారి చైతూ కోసం బాలీవుడ్ విలన్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పర్ష్ శ్రీవాత్సవ ఇప్పుడు చైతూతో ఢీ కొట్టబోతున్నాడు. ‘బాలికా వధు’ సీరియల్ తో బాలీవుడ్ దృష్టిని ఆకట్టుకొన్నాడు శ్రీవాత్సవ. ఆ తరవాత ‘లా పతా లేడీస్‌తో’ మరింత దగ్గరయ్యాడు. తనకు దక్షిణాదిన ఇదే తొలి సినిమా. త్వరలోనే లుక్ టెస్ట్ కూడా జరగబోతోంది. విలన్ పాత్ర రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి.