ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వైసీపీ నేతలు హైదరాబాద్లో చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు, ఆ నిర్వాకాలు వరుసగా బయటకు వస్తున్నాయి. కొండాపూర్ లో వైవీసుబ్బారెడ్డి చేయబోయిన రెండు వందల కోట్ల రూపాయల విలవైన స్థలం కబ్జా వ్యవహారంపై కేసు నమోదు అవగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అమీన్ పూర్లో చేసిన కబ్జాల వ్యవహారం హైడ్రా దృష్టికి చేరింది.
అమీన్ పూర్ లో 193 సర్వే నంబర్ లో ల్యాండ్ కబ్జా కు గురైందని… వైసీపీకి చెందిన మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి .. రమేష్ అనే వ్యక్తితో కలిసి కబ్జా చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అమీన్ పూర్లో కబ్జా చేసిన స్థలంలో చెరువు ఔట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టి పోసి ఎత్తు పెంచారు….దాని వల్ల చెరువు పెద్దగా విస్తరించి.. రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కాటసాని నిర్వాకం వల్ల చాలా లే ఔట్ లు, అగ్రి కల్చర్ ల్యాండ్స్ మునిగి పోయాయని ఆ మహిళ చెబుతున్నారు.
టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ పిక్చర్స్, ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్ కు అందచేశారు. ఆధారాలన్నీ పరిశీలించిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ భరోసా ఇచ్చారు. కాటసాని సెటిల్మెంట్ లో భాగంగా ఆ స్థలాన్ని రాయించుకున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తన స్థలం కోసం ఇతర స్థలాలన్నింటినీ మునిగిపోయేలా చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని కొన్ని వందల మంది ఇళ్ల యజమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఏం చేస్తారో మరి ?