ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. బడ్జెట్ అనగానే అన్ని వర్గాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూంటాయి. ముఖ్యంగా గ్రోత్ తగ్గిపోయిన రంగాలు ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తూ ఉంటాయి. ఈ సారి ప్రభుత్వం, బడ్జెట్ వైపు రియల్ ఎస్టేట్ రంగం కాస్త ఎక్కువ ఆశలు పెట్టుకుంటోంది. ఎందుకంటే గత ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. అందుకే బడ్జెట్లో బూస్ట్ ఇస్తారని రియల్ రంగ వ్యాపారులు అనుకుంటున్నారు .
హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు పెరగడం, ఇల్లు కొనుగోలు చేస్తే వచ్చే పన్ను మినహాయింపులు కూడా పరిమితంగానే ఉండటం, అలాగే ఆదాయంలో అత్యధికం కుటుంబ ఖర్చులకే సరిపోవడం వంటి కారణాల వల్ల ఇళ్లు కొనేవారు తగ్గిపోయారు. ఫలితంగా డిమాండ్ తగ్గింది. రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగితే.. అన్ని రకాల వ్యాపారాల్లో పెరుగుదల ఉంటుంది. తగ్గితే తగ్గిపోతుంది. రియల్ వ్యాపారం అనుకున్నంతగా వృద్ధి చెందకపోవడం వల్ల వృద్ధి రేటు కూడా తగ్గిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే తమ కోసం కాకపోయినా మొత్తం ఆర్థిక వ్యవస్థ కోసం అయినా తమకు కేంద్రం మేలు చేస్తుందని అనుకుంటున్నారు.
నిజానికి రియల్ ఎస్టేట్ రంగం తమపై వరాల జల్లు కురిపించాలని అనుకోవడం లేదు. కానీ మార్కెట్ లో డిమాండ్ పెరిగేలా కొన్ని చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తులు మాత్రం చేస్తున్నారు. ముఖ్యంగా కొనుగోలుదారులకు భారం తగ్గించేలా కొన్ని చర్యలు చేపడితే చాలని అనుకుంటున్నారు. కేంద్రం వైపు నుంచి కూడా కొంత మేలు జరుగుతుందన్న సంకేతాలు వస్తూండటంతో బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.