విశాఖకు సహజసిద్దమైన రియల్ ఎస్టేట్ ఆకర్షణ ఉంది. అక్కడ ఇల్లు ఉండటం చాలా మంది సెలబ్రిటీలకే ఓ ప్యాషన్. ఇక సామాన్యుల సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు మెల్లగా ఆ డిమాండ్ విజయనగరం చేరుకుంటోంది. ఇటీవలి కాలంలో విజయనగరంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరుగుతున్నాయి. బోగాపురం ఎయిర్ పోర్టు విజయనగరం సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే.. వాణిజ్య ప్రాంతంగా విజయనగరం మారిపోతుందనడంలో సందేహం లేదు.
విశాఖపట్నంతో పోలిస్తే విజయనగరంలో ప్రాపర్టీ రేట్లు తక్కువగానే ఉంటాయి. 1,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ 35 లక్షలకు లభిస్తుంది. కానీ విశాఖలో అలాంటి ఫ్లాట్ కోసం యాభై లక్షల వరకూ పెట్టాల్సిల ఉంటుంది. తగరపువలస, మధురవాడ మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న ఆస్తి ధరలతో పోలిస్తే 15 లక్షల వరకూ తగ్గిపోతుంది. అందుకే విశాఖలో ఇల్లు ఉన్న వారు కూడా విజయనగరంలో ఓ ఫ్లాట్ కొనుక్కుంటే మంచిదన్న పద్దతిలో ఆసక్తి చూపిస్తున్నారు.
చాలా మంది వ్యక్తులు తమ దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగా రెండవ అపార్ట్మెంట్ను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. విశాక- విజయనగరం మధ్య యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజూ సిటీకి వెళ్లాల్సిన అవసరం లేని వారు.. విజయనగరంలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో విజయనగరంతో అనుబంధం ఉన్న వారే ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసేవారు. ఇటీవలి కాలంలో ఇతర జిల్లాల నుండి వచ్చి అపార్ట్మెంట్లు, విల్లాలను కొనుగోలు చేసే వారు పెరిగారు. రాను రాను ఇది మరింతగా పెరుగుతుందని అంటున్నారు.
విశాఖ ఓవర్ ఫ్లోస్ వల్ల విజయనగరం ఎక్కువగా లాభపడుతుంది. రెండు జిల్లాల మధ్యలో ఎయిర్ పోర్టు రావడంతో ఇక రెండు జిల్లాలు కలిసిపోయేలా హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చేందుకుఅవకాశాలు కనిపిస్తున్నాయి.