ఓ కొత్త సినిమా విడుదలకు రెడీ అవుతోంటే, సదరు నిర్మాతపై ఐటీ కన్ను పడుతుంది. ఖర్చెంత? రాబడెంత? అందులో ఎంత బ్లాకు, ఎంత వైట్ అనే దానిపై ఫోకస్ పెడతారు. సినిమా విడుదల ఇంకొద్ది గంటల్లో ఉండగా ఐటీ శాఖ రైడ్ చేసిన సందర్భాలెన్నో కనిపిస్తాయి. సినిమా విడుదలైన తరవాత కూడా ఐటీ కన్ను నిర్మాతలపై ఉంటుంది. ఎందుకంటే ఓ బడా సినిమా విడుదలైన తరవాత.. ‘మా సినిమాకు ఇన్ని కోట్లు వచ్చాయి, వసూళ్లలో రికార్డులు బద్దలు కొడుతోంది’ అంటూ నిర్మాతలు స్టేట్మెంట్లపై స్టేట్మెంట్లు గుప్పిస్తారు. అందుకే ఆ లెక్కలన్నీ రాబట్టాలన్నది ఐటీ శాఖ ప్రయత్నం.
నిజానికి ఇది వరకు సినిమావాళ్లకు బ్లాక్ మనీని ఎక్కువ రొటేట్ చేసేవాళ్లు. పారితోషికాల దగ్గర బ్లాక్ మనీ హవా నడిచేది. బ్లాక్ లో ఇంత, వైట్ లో ఇంత.. అని సర్దుబాటు చేసేవారు. కానీ ఆ తరవాత సినిమావాళ్లు కూడా పద్ధతి మార్చారు. నూటికి తొంభై శాతం లావాదేవీలు వైట్ లోనే చేస్తున్నారు. హీరోలు, దర్శకులు తమ పారితోషికాల్ని కేవలం వైట్ లో తీసుకోవడానికే మొగ్గు చూపిస్తున్నారు. టాక్సులు కూడా నిర్మాతే భరిస్తున్నాడు కాబట్టి, ఐటీ ప్రమాదాలు ఉండవు.
కాకపోతే… వసూళ్ల వివరాల దగ్గరే అసలు చిక్కు వస్తోంది. పాత సినిమాల రికార్డులు బద్దలు కొట్టేశాం అని చెప్పుకోవడానికి కలక్షన్లు పెంచి మరీ చూపిస్తున్నారు. కొత్త సినిమా విడుదలైతే, రోజుకో పోస్టర్ బయటకు వస్తోంది. మూడు రోజుల వసూళ్లు, వారం రోజుల లెక్కలు అంటూ.. భారీ అంకెలతో పోస్టర్లు వదులుతున్నారు. ఈ అంకెలన్నీ నిజం కావన్నది అందరికీ తెలుసు. `మేం చెప్పే కలక్షన్లు అస్సలు నమ్మకండి. నిజానికి ఎంత రాబట్టిందో మాకు మాత్రమే తెలుసు` అని నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో కుండ బద్దలు కొట్టేశారు. సినిమా సర్కిల్స్‌లో ఉన్నవాళ్లకు కూడా అసలు లెక్కలు తెలుసు. కాబట్టి ఇలాంటి లెక్కలు వాళ్లు సీరియస్ గా తీసుకోరు. ఐటీ శాఖ కూడా ఆనవాయితీ ప్రకారం నిర్మాతల ఆఫీసుల్లో సోదాలు జరుపుతారు కానీ, అసలు లెక్కలు వాళ్లూ ఎప్పుడూ చెప్పింది లేదు. సో.. కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి రైడ్స్ మామూలే అనుకోవాలి.