టాలీవుడ్ అగ్ర నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రెయిడ్స్ చాలా లోతుగా ఉండటం అగ్ర నిర్మాతల్ని కూడా ఆశ్చర్యరానికి గురి చేస్తోంది. బయటకు కనిపించే నిర్మాతలపై ఐటీ దాడులు చేయడం సహజమే. కానీ వారి అంతర్గత మనీ సోర్సులుగా ఉండే కొంత మంది వ్యక్తులపైనా దాడులు జరుగుతున్నాయి. వారు ఈ నిర్మాతలతో అసోసియేట్ అయ్యారని చాలా మందికి తెలియదు. ఎప్పుడూ వారితో సంబంధాలున్నాయని చెప్పుకోలేదు. కానీ మొదటి సారి దిల్ రాజు, మైత్రి మూవీస్ తో సంబంధం ఉన్న ప్రతి చిన్న ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వ్యక్తులను కూడా వదలకుండా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అంటే టాలీవుడ్ మనీ రూటింగ్ ఎలా జరుగుతుందో సంపూర్ణమైన సమాచారం తీసుకునే ఐటీ అధికారులు పక్కా సమాచారంతో రెయిడ్స్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మాములుగా చేసి నసోదాలు అయితే నాలుగైదు గంటల్లో పూర్తి చేసుకుని వెళ్లిపోయేవారు. కానీ రెండు, మూడు రోజుల పాటు సాగుతాయన్న సంకేతాలు ఇస్తున్నారు. చివరికి బ్యాంక్ లాకర్లను కూడా తెరిపిస్తున్నారు. సినీ ఫైనాన్షియర్స్ ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారంటే.. ఐటీకి ఏదో అంతర్గత సమాచారం చాలా పక్కాగా అంది ఉంటుందని భావిస్తున్నారు.
ఈ సోదాల్లో ఏం దొరికాయన్నదానిపై చిన్న లీక్ కడా ఐటీ అధికారులు బయటకు రానివ్వడం లేదు. అధికారిక ప్రకటన చేస్తారో లేదో కానీ టాలీవుడ్ బడా నిర్మాతలకు సంబంధించిన మనీ ఫ్లో రూట్ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. తేడా వస్తే పెద్ద ఎత్తున జరిమానాలు కట్టుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. .