ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్ (పిపిపి) కింద చేపట్టగల పనులపై క్షేత్రస్ధాయి అవగాహన కల్పించుకోడానికి ఖండాంతరాల నుంచికూడా ప్రయివేటు సంస్ధల ప్రతినిధులు బృందాలు బృందాలుగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయా దేశాలనుంచి ప్రభుత్వ ప్రతినిధులు స్వయంగా వచ్చి ఈ పర్యటనల్ని సమన్వయం చేస్తున్నారు.
సింగపూర్, మలేసియా వంటి తూర్పుఆసియా దేశాల ప్రతినిధులు ఇప్పటికే వచ్చి వెళ్ళారు. జపాన్, చైనాలనుంచి కూడా మరికొందరు వచ్చే ఆవకాశం వుంది. ఇపుడు తాజాగా పశ్చిమాన వున్న యూరప్ నుంచి బ్రిటన్, స్విట్జర్ లాండ్ దేశాల బృదాలు ఇపుడు పర్యటనకు వచ్చాయి.
ఆర్కిటెక్చర్, భవన నిర్మాణం, డిజైన్ రంగాల్లో పిపిపి పద్ధతిలో తమతో కలిసి వచ్చే, ఆసక్తి ఉన్న స్ధానిక బిల్డర్లను కలుపుకుని ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నట్లు స్విట్జర్లాండు నుంచి వచ్చిన ఒక బృందం నాయకుడు విజయవాడలో ఆంధ్రా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు.
రాజధానిలో భారీగా నూతన భవనాలు నిర్మించాల్సి అవసరం వుండనే వుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను తయారు చేయడానికి,కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలు పెట్టింది. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలను ఆహ్వానిస్తున్నారు.స్వయంగా వెళ్ళి ఇక్కడున్న అవకాశాలను వివరిస్తున్నారు. ఈ నేపధ్యమే నిర్మాణ రంగంపై పలు విదేశీ కంపెనీలు ఆసక్తికి కారణం.
కొన్ని కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ప్రాధమిక సర్వే కోసం విజయవాడ, తుళ్లూరు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ దగ్గర నుండి భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కోసం ఇప్పటికే జపాన్, సింగపూర్, చైనా దేశాలతో అవగాహన కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో బ్రిటన్ (యుకె), సింగపూర్‌లాంటి దేశాలతోపాటు పలు దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు విజయవాడపై దృష్టి సారించారు. అక్కడ ఒక హొటల్ లో ఏర్పాటైన చిన్న సమావేశంలో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్, హైదరాబాద్, పౌంఢేషన్ ఫర్ ప్యూట్రిస్టిక్ సిటీస్‌ల ప్రతినిధులు ఆండ్రూ మ్యాక్ అలిస్టెర్, నేతృత్వంలో వచ్చిన బృందం స్మార్ట్ సిటీస్ విజన్ తమను ఎంతో ఆకర్షించిందని, తాము పిపిపి పద్ధతిలో భాగస్వామ్యులయ్యేందుకు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపే నిమిత్తం ఇక్కడికి వచ్చామని పేర్కొంది.
స్మార్ట్ సిటీలంటే సాంకేతిక రంగంగానే అందరూ భావిస్తున్నారని, మౌలిక వసతుల కల్పన, ప్రజలందరినీ భాగస్వామ్యులు చేయడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కూడా స్మార్ట్ కిందనే వస్తుందని చెబుతూ ఈ అంశంపై ఏకంగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం తో స్మార్ట్ సిటీల నిర్మాణం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని యుకె ప్రతినిధులు కోరుతున్నారని సమాచారం. స్మార్ట్ సిటీల నిర్మాణంలో పేదలకు తక్కువ బడ్జెట్‌తో గృహాలు, 80 శాతం మందికి ఉపయోగపడేవిధంగా రివర్‌క్రాసింగ్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేందుకు బ్రిటన్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి చెందిన బిసిఏ డిప్యూటీ డైరెక్టర్ ఎం.గౌవీహాంగ్, బిసిఏ సౌత్ ఏసియా డెస్క్ ఛెంగ్ జీ, బిసిఏ సౌత్ ఏసియా డెస్క్ ఏసిఏ జయపాల్‌తో కూడిన బృందం పర్యటన కూడా ఆతరువాత ముగిసింది. నూతన భవనాల నిర్మాణంలో తాము భాగస్వామ్యం వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఇక్కడ పర్యటిస్తున్నట్లు బృందం సభ్యులు చెప్పారు.