ఐసిస్ ఉగ్రవాదులని సమూలంగా తుడిచిపెట్టేందుకు అగ్రరాజ్యాలు వైమానిక దాడులు చేసి ఎన్ని బాంబులు కురిపిస్తున్నప్పటికీ వారు చాలా దేశాలలో వ్యాపించి ఉన్నందున నిత్యం ఎక్కడో అక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ లో ఉగ్రవాదుల చేతిలో 8మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి వరుసగా ఉగ్రవాదుల దాడుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దాడుల తరువాత, డాకా రెస్టారెంట్ లో 20 మంది విదేశీయులు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలోగల ఒక మశీదుపై సోమవారం తెల్లవారుజామున ఆత్మహుతి దాడి జరిగింది. ఒక ఉగ్రవాది బారీ ప్రేలుడుసామాగ్రితో నింపిన కారుతో లోపలకి దూసుకుపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో ఎవరైనా మరణించారో లేదో ఇంకా తెలియవలసి ఉంది. 2004 అక్కడే జరిగిన ఆత్మాహుతి దాడిలో 9మంది మరణించారు.