ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభల్లో పలువురు గ్రామస్తులు పేర్లు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కానీ వారికి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని స్టాంప్ వేసి మరీ ప్రచారం చేస్తోంది. అది వ్యతిరేకత అని బీఆర్ఎస్ అనుకుంటోంది. నిజానికి అలా చెబుతోంది కానీ.. గ్రామసభల్లో వచ్చిన స్పందన బీఆర్ఎస్ పెద్దల్ని ఖచ్చితంగా ఆలోచింప చేస్తుందని అనుకోవచ్చు.
ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో చేస్తుందని నమ్మకం ఉండటంతోనే అంత మంది వచ్చి ..తమకు పథకాలు రావాలని… తాము అర్హులం అని వాదిస్తున్నారు. ఇలాంటి నమ్మకం ప్రభుత్వంపై ఉండటం కంటే కావాల్సింది ఏముంది ?. తెలంగాణ ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అలాంటి సమయంలో ప్రజలు ఇంత స్పందన వ్యక్తం చేయడం చిన్న విషయం కాదు.
పథకాల లబ్దిదారుల కోసం గ్రామసభలు లేదా వార్డు సభలు పెడితే…. తమకు రాలేదని ఖచ్చితంగా కొంత మంది వస్తారు. అందులో సందేహం ఉండదు. ఆ మాత్రం తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు పెట్టదు. కానీ లక్ష్యం వేరు. అది తమ ప్రభుత్వం ఎంత యాక్టివ్ గా పని చేస్తుందో అందరికీ తెలియచెప్పడంతో పాటు తమ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ప్రజలు ఉన్నారని.. బీఆర్ఎస్ ప్రచారాన్ని నమ్మడం లేదని నిరూపించడం లక్ష్యంగా వీటిని నిర్వహించారు. ప్రజాభాగస్వామ్యాన్ని మించిన రాజకీయ వ్యూహం మరొకటి ఉండదు.
బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ ఇలా మూకుమ్మడి గ్రామసభలు నిర్వహించలేదు. నిర్వహించినా కొంత మందితో తూ..తూ మంత్రంగా నడిపించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత అని ప్రచారం చేసుకుని సంతృప్తి పడటం తప్ప.. లోతుగా ఆలోచిస్తే.. తామే బావిలో ఉన్నామని బీఆర్ఎస్ నేతలకు అర్థమవ్వాలి. రేవంత్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ కు కావాల్సింత ప్రచారం చేస్తూ పోవడమే.