నవ్విన నాప చేనే పండింది. జనసేన పార్టీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందినప్రాంతీయ పార్టీ. జనేసనకు గుర్తింపు లేదని ఆ పార్టీ గాజు గ్లాసు గుర్తు శాశ్వతం కాదని ఎగతాళి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆజ్ఞాతంలో ఉన్నారు. కానీ ఆ గాజు గ్లాస్ గుర్తు సగర్వంగా శాశ్వత గుర్తుగా జనసేన ఖాతాలో చేరింది. తమ పార్టీ పరిస్థితి ఏమిటో తెలియక వైసీపీ నేతలు కిందా మీదా పడుతున్నారు.
జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పవన్ కల్యాణ్ కు అధికారిక సమాచారం పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్లా విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.
జనసేన పార్టీ ఇ 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి. అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి. 2019లో జనసేనకు ఆరు శాతం ఓట్లు కంటే కొద్ది ఓట్లు తక్కువ వచ్చాయి. అసెంబ్లీ స్థానం కూడా ఒకటే వచ్చింది. కనీసం ఒక లోక్సభ స్థానం గెలిచినట్లయినా గుర్తింపు దక్కి ఉండేది. ఏ సీట్లు సాధించకపోయినా ఎనిమది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది. కానీ అవేమీ అప్పటి ఎన్నికల్లో రాలేదు. కొద్దిలో మిస్ అయింది. ఈ సారి ఎన్నికల్లో 21 చోట్ల పోటీ చేసి మొత్తం గెలిచారు. ఓటు బ్యాంక్ కూడా ఎనిమిది శాతం దాటిపోయింది. గుర్తింపు లేనందున జనసేన గుర్తు గాజు గ్లాస్ పై రకరకాల వివాదాలు ప్రారంభించేవారు. కుట్రలు చేసేవారు. ఇక ముందు ఆ అవకాశం లేదు. గాజు గ్లాస్ గుర్తు జనసేనకు మాత్రమే ఉంటుంది. ఇతరులకు కేటాయించే అవకాశాలు ఉండవు.