తమిళ హీరోలపై దర్శకుడు, నటుడు గౌతమ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదం అనేదానికంటే.. నిజం మాట్లాడాడు అనడమే బెటర్. తమిళ హీరోలు చిన్న కథల్ని, చిన్న బడ్జెట్ సినిమాల్నీ ఒప్పుకోవడం లేదని, వాళ్ల దృష్టి పెద్ద సినిమాలూ, పెద్ద బడ్జెట్ లపైనే ఉందని, బడ్జెట్ లను చూసి సినిమాలు ఓకే చేస్తున్నారని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు గౌతమ్ మీనన్. ఒక సినిమా రూ.100 కోట్లు పెట్టి తీసేకంటే, పది కోట్లతో పది సినిమాలు తీస్తే లాభదాయకంగా ఉంటుందని, అయితే… అందుకు హీరోలు ముందుకు రారని, ఈ విషయం చెబితే తమిళ చిత్రసీమ నుంచి తనని వెలి వేస్తారని, అక్కడ మనుగడ కూడా ఉండదన్న ఆవేదననీ వ్యక్తపరిచారాయన.
మమ్ముట్టి కథానాయకుడిగా ‘డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’ అనే సినిమా తీశారు గౌతమ్ మీనన్. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డొమినిక్ కథని చాలామంది తమిళ హీరోలకు వినిపించారు గౌతమ్. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. చివరికి మలయాళ చిత్రసీమకు వెళ్లిపోయి, అక్కడ మమ్ముట్టితో ఈ కథని తెరకెక్కించాల్సివచ్చింది. ఈ బాధతో, ఆవేదనతో గౌతమ్ ఈ కామెంట్లు చేసి ఉండొచ్చు. చిన్న కథ రాసుకొంటే – మలయాళ సీమ వెళ్లిపోవాల్సిందే అంటూ ఆయన కౌంటర్ వేశారు.
నిజానికి ఈ దౌర్భాగ్యం తెలుగులోనూ వుంది. ఎవరికీ సింపుల్ కథలు ఎక్కడం లేదు. పెద్ద బడ్జెట్లూ, భారీ సినిమాలే కావాలి. పెద్ద హీరోలే కాదు. ఓ రేంజ్ ఉన్న మీడియం హీరోలూ ఇదే మాట అంటున్నారు. ఎవరైనా కథ చెప్పడానికి వెళ్తే.. ‘బడ్జెట్ ఎంత అనుకొంటున్నారు’ అనే పాయింట్ దగ్గర్నుంచి డిస్కర్షన్ మొదలెడుతున్నారు. ‘నా బడ్జెట్ రూ.40 కోట్లు.. అది దాటే కథలే చెప్పండి’ అంటూ ఓ యువ హీరో దర్శక నిర్మాతల్ని నేరుగానే అడిగేశాడట. బడ్జెట్ ఇంత అని హీరోలు డిసైడ్ చేయకూడదు. కథలు డిసైడ్ చేయాలి. రూ.10 కోట్లతో తీసిన కథల్లో గొప్ప కథలు ఉండవా? ఓ సింపుల్ కథ ప్రేక్షకులకు నచ్చేలా తీస్తే వంద కోట్లు కొట్టదా? ఈ వాస్తవాల్ని హీరోలు ఎందుకు తెలుసుకోవడం లేదో?! వరల్డ్ బిల్డింగ్, పాన్ ఇండియా ఇలాంటి పదాలు హీరోల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రస్తుతం అంతా ఈ మాయలో కొట్టుకుపోతున్నారు. అందులోంచి బయటకు వస్తే తప్ప ఈ బడ్జెట్ లు కంట్రోల్ లో ఉండవు.