హైదరాబాద్ లోని టాలీవుడ్ అగ్రనిర్మాతలపై జరుగుతున్న ఐటీ సోదాలు రెండో రోజుకు చేరాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో లెక్కలు ఆరాతీస్తూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్ వచ్చిన ఆదాయ.. వాటిపై కట్టిన ట్యాక్స్ ను ఆరా తీస్తున్నారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో.. బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు ఈ రోజు మరికొన్ని ఆస్తుల లావాదేవీలను పరిశీలించే అవకాశం ఉంది.
దిల్ రాజును ఐటీ అధికారులు బయటకు పోనివ్వడం లేదు. ఈ రోజు ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకెళ్లి అక్కడ మరిన్ని వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్షియర్ల దగ్గర ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారు. మొత్తం 55 బృందాలుగా జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లలో ఎనిమిది చోట్ల సోదాలు సాగుతున్నాయి. ప్రధానంగా దిలీప్ రాజు దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి.
ఈ ఐటీ దాడులు ఆషామాషీగా లేవని.. పక్కా సమాచారంతోనే అధికారులు వచ్చారని భావిస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ వరుసగా సినిమాలు నిర్మిస్తున్న మరికొంత మంది భారీ నిర్మాతలపైనా ఐటీ అధికారుల దృష్టి ఉందని అంటున్నారు. ఈ సోదాలు ఇవాళ ముగుస్తాయా కొనసాగుతాయా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది.