ప్రస్తుతం తెలుగులో ఆయనో టాప్ రైటర్. పారితోషికం గట్టిగానే తీసుకొంటున్నాడు. ఫామ్‌లోనూ ఉన్నాడు. కామెడీ బాగా రాస్తాడన్న పేరుంది. కాకపోతే ఒకటే బ్యాడ్ హ్యాబిట్. లేడీస్ వీక్నెస్. అవకాశం కోసం ఎదరు చూసే అమ్మాయిలకు `మా సినిమాలో వేషం ఇస్తాలెండి` అంటూ బుట్టలో వేసుకోవడంలో దిట్ట. ఈ విషయం తనతో పని చేసే దర్శక నిర్మాతలకు బాగానే తెలుసు. కానీ భరిస్తున్నారు. ఇప్పుడు ఓ సినిమా పనిలో తలమునకలై ఉన్నాడు సదరు రచయిత. తన సినిమా అంటే సెట్లో రైటర్‌గా తాను ఉండాల్సిందే. ఉంటే ఫర్వాలేదు. ఉన్నవాడు ఖాళీగా ఉండకపోవడమే అసలు సమస్య. తన సినిమాలో పని చేస్తున్న హీరోయిన్ గుడ్ లుక్స్ లో పడడానికి తెగ తాపత్రయపడుతున్నాడు. పొద్దుట హీరోయిన్ సెట్ కి రాగానే ‘లంచ్‌లో ఏం కావాలి.. డిన్నర్లో స్పెషల్ ఏం తెప్పించమంటారు’ అంటూ అచ్చంగా ప్రొడక్షన్ బాయ్‌లా ప్రవర్తిస్తున్నాడట. హీరోయిన్ ఏం అడిగినా, కాదనకుండా తీసుకొస్తున్నాడట. అయితే..ఈ ఖర్చంతా నిర్మాతే భరించాల్సివస్తోంది. అది అసలు తలనొప్పి.
రైటర్ చేస్తున్న ఓవరాక్షన్ చూసి మిగిలిన వాళ్లు నవ్వుకొంటున్నారని, సెట్లో ఇదే హాట్ టాపిక్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘నువ్వు ఆఫీసులో ఉండి రాసుకో.. సెట్ కి రావాల్సిన పనిలేదు’ అని చెబుదామంటే సదరు దర్శకుడికి రైటరే… రైటూ లెఫ్టూ. అందుకే అలా కూడా అనలేకపోతున్నారు. అందుకే… తను చేసే ఎగస్ట్రాలన్నీ చూసి భరిస్తున్నారు. హోటెల్ బిల్లులు కడుతున్నారు. ఈ సినిమా ఎప్పుడైపోతుందా, ఈ రైటర్‌తో తననొప్పి ఎప్పుడు తగ్గుతుందా అని నిర్మాత కూడా ఎదురు చూస్తున్నాడట. ఇలాంటి వ్యవహారాలు చెప్పుకోవడానికీ, చదువుకోవడానికీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడో ఓసారి సీన్ రివర్స్ అవుతుంది. అది కాస్త రైటర్ మెడకు చుట్టుకొంటుంది. ఈమధ్య హీరోయిన్లు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎవరైనా తమని ఇబ్బంది పెడితే, దాన్ని మనసులో ఉంచుకొని, అనువు చూసుకొని రచ్చ మొదలుపెడుతున్నారు. ఇతగాడికీ అలాంటి ఝలక్కే తగులుతుందేమో చూడాలి.