‘కన్నప్ప’… ఓరకంగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాపై దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టాడు విష్ణు. కుటుంబ కలహాలు విష్ణుని కొంత వరకూ డిస్ట్రబ్ చేశాయి. ‘కన్నప్ప’ హిట్ కొడితే – వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కొంత కోలుకొందామని చూస్తున్నాడు. మంచు విష్ణు కెరీర్‌నే కాదు, తన ఆర్థిక స్థితిగతుల్ని కూడా డిసైడ్ చేసే సినిమా ఇది. కాబట్టి ఎక్కడా, ఎలాంటి పొరపాటూ జరక్కుండా చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా గట్టిగానే ప్లాన్ చేశాడు. ఆ భారాన్ని ప్రభాస్ పై వేద్దామని చూశాడు విష్ణు.
‘కన్నప్ప’లో ప్రభాస్ అతిథి పాత్రలో మెరవబోతున్నాడు. ప్రభాస్ కోసమైనా ప్రేక్షకులు ‘కన్నప్ప’ చూడ్డానికి వస్తారన్నది విష్ణు ఆశ. ప్రమోషన్లలోనూ ప్రభాస్‌ని వాడుకోవాలనుకొంటున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈలోగా.. హైదరాబాద్, తిరుపతి.. ఈ రెండు చోట్లా భారీ ఈవెంట్లు నిర్వహించాలనుకొంటున్నాడు. ఈ రెండింటిలో ఒకదానికి ప్రభాస్ ని తీసుకురావాలన్నది ప్లాన్. ప్రభాస్ వస్తే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకొంటారు. ప్రభాస్ పాత్రకు సంబంధించిన టీజర్‌ని కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. అయితే.. ఈవెంట్లకు రావడం విషయంలో ప్రభాస్ ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. తనకు స్వతహాగా ప్రమోషన్లు పడవని, ఈవెంట్స్‌కి దూరంగా ఉంటానని ప్రభాస్ చెబుతున్నాడట. అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకొని, విష్ణుకి పెద్ద ఉపకారమే చేశాడు ప్రభాస్. అందుకే.. విష్ణుకి కొత్తగా వరాలు అడిగే అవకాశం లేదు. ప్రమోషన్లకు రమ్మని ఒత్తిడి చేసే పొజీషన్లోనూ విష్ణు లేడు. అందుకే కనీసం కామన్ ఇంటర్వ్యూ కోసమైనా ప్రభాస్‌ని ఒప్పిద్దామని విష్ణు ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ప్రభాస్‌కు అస్సలు తీరిక లేదు. వరుస షూటింగులతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ‘ఫౌజీ’ హడావుడిలో పడిపోవాలన్నది తన ప్లానింగ్. ఫౌజీ షూటింగ్ త్వరలో మైసూర్లో జరగబోతోంది. ఆ తరవాత జరగబోయే షెడ్యూల్స్ ఖరారు అవ్వాల్సివుంది. అవి డిసైడ్ అయితే కానీ, ‘కన్నప్ప’ ప్రమోషన్ల విషయం తేలదు.