హైడ్రా కూల్చివేతలపై దానం నాగేందర్ మరోసారి ఫైరయ్యారు. చింతల్ బస్తీలో కూల్చివేతల్ని ఆయన అడ్డుకున్నారు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద చిన్న చిన్న దుకాణాల్ని పెట్టుకుని ఏళ్ల తరబడి జీవిస్తున్న వారి ఉపాధిని పోగొట్టడం ఏమిటని ఆయన మండిపడ్డారు. కూల్చివేతల వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ కు ఫోన్ చేసి.. సీఎం దావోస్ నుంచి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. కమిషనర్ రంగనాథ్ ఏం చెప్పారో కానీ.. ఆయన మాత్రం శాంతించలేదు.
బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హైడ్రా విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదని అంటున్నారు.
మన మీద ప్రజలకు నమ్మకం లేదని, ఇప్పుడైనా దానిని పెంచుకోవాలని ముఖ్యమంత్రికి సలహాలిస్తున్నారు. అయితే ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత హెచ్చరికలు వచ్చినా కొంత కాలం సైలెంట్ గా ఉన్నారు కానీ.. ఇప్పుడు మళ్లీ తన వాయిస్ రైజ్ చేస్తున్నారు. దీంతో దానం ఇక కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలో ఉన్నారని అంటున్నారు.