టాలీవుడ్ బడా నిర్మాతలపై జరుగుతున్న ఐటీ దాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. వందల మంది మూడో రోజూ లెక్కలు తీస్తున్నారంటే చాలా చాలా లోతుగా తవ్వుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆయా నిర్మాతలకు మాత్రమే తెలిసిన ఫైనాన్షియర్ల దగ్గర నుంచి సోదాలు చేస్తున్నారు. అంటే మొత్తం ఆర్థిక సామ్రాజ్యం గుట్టును బయటకు తీయాలని అనుకునే వచ్చారని అనుకోవచ్చు.
ఐటీ దాడుల్లో ఏం దొరికాయన్నదానిపై మాత్రం చిన్న లీకులు కూడా బయటకు రానివ్వడం లేదు. సినిమా వాళ్ల ఇళ్లల్లో నోట్ల కట్టల డంప్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి బ్లాక్ మనీ ఏమీ దొరకలేదని అర్థం అవుతోంది. నిజంగా అలాంటివి దొరికితే ఖచ్చితంగా దృశ్యాలు బయటకు వచ్చేవి. పూర్తిగా పన్ను ఎగవేత అంశాలపైనే లెక్కలు తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
టాలీవుడ్ లో మనీ ఫ్లో ఎలా ఉంటుందన్న దానిపై పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు రావడంతో .. ఏదీ దాచడానికి అవకాశం లేకుండా పోయింది. పుష్ప నిర్మాతలతో పాటు దిల్ రాజు గ్రూపును మాత్రమే ప్రస్తుతానికి టార్గెట్ చేసుకున్నారు. యాక్టివ్ గా సినిమాలు తీస్తోంది వారే. భారీ ప్రాజెక్టులను చేపడుతోంది వారే. సినిమా బిజినెస్ గతంలోలా ఇప్పుడు బ్లాక్ మనీ మీద నడవడం లేదు. కొంత వరకూ టాక్సులు తప్పించుకునే ప్రయత్నంలో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల..చిక్కులు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజుతో సోదాలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఐటీ శాఖ నుంచి ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.