హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తర్వాత జరిగే బదిలీల్లో వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సారి ఆయనకు అంత కంటే ప్రాధాన్య పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుకున్నది ఒకటి.. జరిగింది ఒకటి. పూర్తి స్థాయిలో ప్రణాళికలు లేకపోవడం వల్ల.. మధ్యతరగతి ఇళ్లు కూల్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ సమస్యలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి.. కమిషనర్ రంగనాథ్‌కు సపోర్టుగానే ఉన్నారు.
తర్వాత రంగనాథ్ కూడా చాలా వరకూ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. హైడ్రా ఏర్పడక ముందు కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో హెచ్‌ఎండిఏనే చర్యలు తీసుకుంటుందని ఆ తర్వాత చేసిన అక్రమాలపైనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ మేరకు బాగా దూకుడు తగ్గించారు. పూర్తి స్థాయిలో ఆక్రమణలు, కబ్జాలు అని తేలిన వాటిని మాత్రమే కూల్చడం ప్రారంభించారు. అయితే కమిషనర్ గా రంగనాథ్ ఉన్నంత కాలం హైడ్రా భయం ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడటంతో.. ఆయనను మార్చడమే మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రంగనాథ్ ఏ పొజిషన్ లో ఉన్నా తనదైన ముద్ర వేస్తారు. ఆయన గతంలో బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహితంగా ఉండేవారు. అందుకే రేవంత్ పదవి చేపట్టినప్పుడు కీలకమైన పోస్టింగ్ దక్కలేదు. పక్కన పెట్టారు. కానీ హఠాత్తుగా హైడ్రా కమిషనర్ గా చాన్సిచ్చారు. మొదట్లో హాట్ టాపిక్ అయినా తర్వాత మాత్రం ఇబ్బందిపడ్డారు.