సంక్రాంతి సీజన్ ముగిసిపోయింది. సంక్రాంతి విజేత ఎవరు? అనే లెక్కలు తేల్చే పనిలో ఉంది చిత్రసీమ. ఆ అర్హత… ‘సంక్రాంతికి వస్తున్నాం’కే ఉంది. ‘డాకూ మహారాజ్‌తో’ పోలిస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫుట్ ఫాల్స్ ఎక్కువ. లాభాల శాతమూ ఎక్కువే. కాబట్టి నిస్సందేహంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విన్నర్ అనుకోవొచ్చు. సంక్రాంతి సీజన్ కి ముందుగా ప్రకటించిన సినిమాల జాబితాలో ‘విశ్వంభర’ వుంది. ఈ సంక్రాంతికి చిరు సినిమా వచ్చి తీరుతుందని అభిమానులు ఆశించారు. యూవీ క్రియేషన్స్ కూడా అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసింది. కానీ ఎప్పుడైతే ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి బరిలో నిలిచిందో, అప్పుడు ‘విశ్వంభర’ పక్కకు తప్పుకోవాల్సివచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ హిట్టయితే – మెగా అభిమానులు ఆనందించేవారే. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. కనీసం ‘విశ్వంభర’ విడుదలైనా బాగుండేదని, అసలు సిసలైన పండగ సినిమా అదే అయ్యేదని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అందులోనూ నిజం లేకపోలేదు. ‘విశ్వంభర’లో కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉన్నాయి. ఐదుగురు అక్కాచెల్లెళ్లకు సోదరుడిగా చిరంజీవి నటించారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేశారు. దేవుడు – దైవత్వం అనే కాన్సెప్టులకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ వేరు. ఏ కోణంలో చూసినా సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అయ్యేది. కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` పెద్ద హిట్ అయ్యింది. ఆ స్థాయిలో ‘విశ్వంభర’కూ వసూళ్లు దక్కే అవకాశం ఉండేది.
‘విశ్వంభర’ లాంటి సినిమాలకు పండగ సీజన్లే కరెక్ట్. ఇప్పుడు సంక్రాంతి సీజన్‌ని చేజార్చుకొంది. వస్తే గిస్తే… వేసవిలో రావాలి. అయితే వేసవిలో పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. `విశ్వంభర`కు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. సినిమా విడుదల ఇప్పుడు పూర్తిగా ఓటీటీల చేతుల్లోనే ఉంది. వాళ్లు చెప్పిన డేట్ కే సినిమాల్ని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వంభరకు ఓటీటీ డీల్ క్లోజ్ అయితే కానీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రాదు.