హోమ్ లోన్స్ అంటే సుదీర్ఘకాలం ఉండేవి. పదిహేను నుంచి పాతికేళ్ల వరకూ కాల వ్యవధి ఉంటుంది. హోమ్ లోన్స్ ఉండే మంచి లక్షణం ఏమిటంటే.. ప్రతీ ఏడాది రూపాయికి విలువ తగ్గిపోతుంది. ద్రవోల్బణం పెరుగుతుంది. జీతాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ ఈఎంఐ మాత్రం అంతే ఉంటుంది. అంటే పదేళ్ల కిందట ఇరవై వేలు ఈఎంఐ ఉంటే.. చివరి వరకూ అదే ఉంటుంది. హోం లోన్ తీసుకున్నప్పుడు కాస్త భారంగా ఉండే ఈఎంఐ రాను రాను తేలికగా మారుతుంది.
అయితే హోమ్ లోన్ తీరే కొద్దీ కొంత మంది ఇతర అవసరాల కోసం దాని మీద టాపప్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. హోమ్ రెనేవేషన్ పేరుతో ఈ లోన్స్ తీసుకుంటారు. ఇంటికి అలాంటి రిపేర్లు చేయిస్తారో లేదో తెలియదు కానీ రుణాలు తీసుకుంటారు. ఇలా రుణంపై మళ్లీ టాపప్ లోన్ తీసుకోవడం మంచిదేనా అన్నదానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. డబ్బులు తక్కువ వడ్డీకి వచ్చే మార్గం లేనప్పుడు.. ఖచ్చితంగా నగదు అవసరం అయినప్పుడు టాపప్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అనుత్పాదక వ్యయం అంటే.. విలువ లేని వాటి కోసం పెట్టే ఖర్చుల కోసం లోన్లు తీసుకుంటే మాత్రం.. అది మంచి రుణం అవ్వదు.
ఇల్లు అనేది స్థిరాస్తి. దాన్ని అంతే స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దానిపై అదే పనిగా లోన్లు తీసుకుంటే.. రాను రాను వడ్డీలు పెరిగిపోయి ఆ ఆస్తి సొంతది కాకుండా పోతుంది. టాపప్ రుణాల విషయంలో బ్యాంకర్లు కూడా ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తారు. హోమ్ లోన్ కు ఇచ్చినంత తక్కువగా రుణం ఇవ్వరు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని టాపప్ రుణాల విషయంలో నిర్ణయం తీసుకుంటే బెటర్.