తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ సామాజిక పరిణామాలను గమనిస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమ కాలంనుంచి ప్రత్యక్షంగా వీటిని చూడటమే గాక వాదోపవాదాల్లోనూ పాల్గొన్న వ్యక్తిగా వీటి వెనక వున్న రాజకీయ తర్కం కూడా అర్థమవుతూనే వుంది. ఓటుకు నోటుతో పరాకాష్టకు చేరిన ఘర్షణ తర్వాత ఏకపక్షంగా పరిష్కారమైంది. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో కెటిఆర్ ముందుండి తెలుగువారంతా ఒక్కటేనన్నట్టు మాట్టాడ్డం మరింత మార్పు తెచ్చింది.గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రారంభ సభలో ఎన్టీఆర్ వారసత్వాన్ని ఉమ్మడి చరిత్రను గొప్పగా చెప్పడం ద్వారా కెసిఆర్ ఆ ప్రక్రియను తారస్థాయికి చేర్చారు. తొమ్మిదేళ్ల ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎలాగూ తనకు రెండురాష్ట్రాలూ ఒకటేనని చెబుతుంటారు. విభజన రెండేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ఇరువైపులా వున్న ప్రజలలోనూ యువతలోనూ పాత విషయాలపై పెద్ద పట్టింపులు తగ్గాయి. అయితే సహజంగానే రకరకాల పంపకాల సమస్యలు వున్నాయి. ఇలాటి సందర్భాలలో కాస్త వేడి పెరిగినా రాజకీయ నాయకత్వాలు మళ్లీ సామరస్య గీతాలే ఆలపిస్తున్నారు. అమెరికాలో కవిత జై తెలంగాణ జై ఆంధ్ర అనేశారు. పత్రికలు మీడియా సినిమాలు అన్నీ మారిన పరిస్థితులకు అలవాటు పడిపోవడం గమనిస్తున్నా. ఇటీవల హైకోర్టు చర్చ హైవోల్టేజికి చేరినా చివరకు ముగిసిపోనున్నది. రాజకీయ నేతలు సంపన్నవర్గాలు సామాన్య ప్రజలు వ్యాపారులు సర్దుబాటు చేసుకుంటుంటే బుద్ధిజీవులు ఉద్యోగులు న్యాయమూర్తుల వంటివారే ఉద్రేకాలకు గురి కావడం దురదృష్టకరం. ఏ విభజనలోనైనా సమస్యలు వుంటాయి.వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి గాని సంఘర్షణ పెంచుకోకూడదు. వీరందరినీ మించి కొందరు రచయితలు భాషా వేత్తలు సాహిత్య జీవులు ఇంకా తెలంగాణ ఆంధ్ర తేడాల పరిశోధనల్లోనే మునిగితేలడం అవసరం లేనిపని. కొత్త రాష్ట్రంలోనూ విభజిత రాష్ట్రంలోనూ సానుకూల దిశలో సమగ్ర పరిశోధనలే చేసి నిజాలు నిగ్గుతేల్చవచ్చు. కాని గతంలో ఎవరో ఎక్కడో చేసిన లేదా చేసినట్టు చెప్పబడుతున్న చెెదురు మదురు వాదనలను పెద్దవి చేసి చూసుకుంటూ వివాద వాతావరణాన్ని సాగదీసుకోవలసిన అవసరం లేదు. భాషా పరంగా ఒకటైనా భౌగోళికంగా రెండు రాష్ట్రాలు గనక ఎక్కడి ప్రత్యేకతలు వారు మదింపు వేసుకోవచ్చు. చరిత్రను పరిశోధించవచ్చు. ఎక్కువ తక్కువలూ వెక్కిరింతలు కొక్కిరింతలూ అదేపనిగా స్మరించుకుంటూ వాటికి లేని విలుల ఇవ్వనవసరం లేదు. రాజకీయ నాయకులు జీవిత పోరాటాలలో మునిగితేలే ప్రజల మాదిరిగానే బుద్ధిజీవులు కూడా వర్తమాన వాస్తవాలను గుర్తిస్తే గతం గాయాలు నిలవవు. చరిత్ర సృష్టించిన సమస్యలు చరిత్రే పరిష్కరిస్తుంది. అందుకు వ్యవధి పడుతుంది.ఈలోగా ఒకరివైపు ఒకరు వేలు చూపించుకోనవసరం లేదు. అటూ ఇటూ ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ వాస్తవికతను గుర్తించాల్సి వుంటుంది.