రామ్ గోపాల్ వర్మ కు ముంబైలోని అంథేరీ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెల్లడించింది. ఎన్ని సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసినా ఆయనకోర్టుకు హాజరు కాలేదు. 2022లో ఓ సారి ఇలాగే ఆయనపై వారెంట్ జారీ అయితే కోర్టుకు హాజరై ఐదు వేల రూపాయలు పూచికత్తు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. మళ్లీ కోర్టుకు హాజరు కావడం మానేశారు. ఇప్పుడు కోర్టు విచారణ పూర్తి చేసి ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది.
అయితే చెక్ బౌన్స్ కేసులో మొత్తం చెల్లించాల్సింది మూడు లక్షల డెబ్భై రెండు వేల రూపాయలు మాత్రమే. ఇంత చిన్న మొత్తానికి ఆర్జీవీ 2018 నుంచి చెక్ బౌన్స్ కేసు ఎందుకు ఎదుర్కొంటున్నారు.. అందులోనూ 2022లో పూచికత్తు సమర్పించి బెయిల్ తెచ్చుకోవడమూ వింతగా ఉంది. అయితే ఆయనపై ముంబైలో ఈ ఒక్క కేసు కాదని లెక్కలేనన్ని ఉన్నాయన్న ప్రచారం ఉంది. అనధికారికంగా ఫైనాన్స్ తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన ముంబై లో బిచాణా ఎత్తేసి హైదరాబాద్లోనే ఉంటున్నారని.. ఇటీవలి కాలంలో ముంబై వెళ్లిన దాఖలాలు కూడా లేవంటున్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వంలో ఆయన ఓ స్కాం చేశారు. జగన్ రెడ్డి కోసం తీసిన రెండు సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ లో రిలీజ్ చేసి కోటిన్నర కొట్టేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే కేసులు పెడతామని ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ఏం స్పందించారో ఇంకా స్పష్టత రాలేదు. డబ్బులు చెల్లించకపోతే ఆయనపై కేసులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.