ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు లచ్చల కోట్ల పెట్టుబడులు ఏపీకి రాకుండా పోయాయట. జగన్ క్లాస్ మేట్.. మిత్రోం జిందాల్ ఈ మొత్తం ఏపీలో జత్వానీ కేసు వల్లే పెట్టడం లేదట. తన పై కేసు పెట్టారన్న కోపంతో పోయి మహారాష్ట్రలో పెడుతున్నారట. జగన్ రెడ్డి ఆస్థాన రచయితలు.. కుట్ర సిద్ధాంతాల్లో ఇట్టే దొరికిపోయే ప్లాన్లు వేసే సజ్జల నేతృత్వంలో రెడీ అయిన జర్నలిస్టులు కథ అల్లేస్తే..దాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించేసింది. వైసీపీ క్యాడర్ కూడా పాపం అనుకునే పరిస్థితికి వచ్చింది.
అసలు ఈ మూడు లక్షల కోట్ల లెక్కేమిటో కానీ దావోస్ పోయి.. అక్కడ ఫడ్నవీస్ లో మహారాష్ట్రలో రెండున్నర లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేస్తానని ఓ పేపర్ మార్చుకున్నారు. అది ఏపీకి రావాల్సిందని సాక్షి చెబుతోంది. ఎప్పుడైనా ఈ ప్రతిపాదన ఏపీకి వచ్చిందని ఎప్పుడూ చెప్పలేదు. కనీసం తన మిత్రుడు జగన్ ఉన్నప్పుడైనా ఆయన వచ్చి పెట్టుబడులు పెడతానని చెప్పలేదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి.. ఓ డెడ్ లైన్ పెట్టి కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ ఉన్న ఐదేళ్లలో రూపాయి కూడా పెట్టుబడి పెట్టని జిందాల్ .. జత్వానీ కేసులో నిజాలు బయటకు తీశారని అలిగి మహారాష్ట్రలో పెడతాడా ?
మూడు లక్షల కోట్లు అంటే అంత ఆషామాషీగా ఉందేమో కానీ.. ఎలాన్ మస్క్ కూడా ఇలాంటి ప్రకటన చేయలేరేమో?. మనవాళ్లు మాత్రం అలవోకగా చేసేస్తారు. నమ్మేవాడుంటే చెప్పేవాడు సాక్షి అని.. వైసీపీని .. సాక్షిని ఇంకా నమ్మేవారుంటే.. వారందర్నీ.. పిచ్చి మాలోకాల్ని చేయడానికి బయలుదేరి వస్తారు. జత్వానీకి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి మాఫియా మాదిరిగా వేధించిన వైనంలో అందరికీ శిక్షపడితేనే ప్రజలకు భరోసా లభిస్తుంది. ఈ ఉత్తుత్తి ప్రకటనల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.