గ్రామసభల్లో అలజడి జరుగుతోందన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ తంటాలు పడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అలజడి చేస్తున్నారని నాలుగు శాతం గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఉందని మిగతా అంతా ప్రశాంతంగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది . కానీ దీనికి భిన్నంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు. రాజకీయ ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రచారం కోసం కొంత మందిని రెచ్చగొట్టి చేస్తున్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తోంది. అలాంటప్పుడు తీసుకోవాల్సిన చర్యల విషయంలో కఠినంగా ఉండాల్సింది. కానీ అలాంటి ఆలోచన చేయలేదు.
పైగా ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా మంత్రుల ప్రకటనలు ఉన్నాయి. గ్రామసభల్లో ప్రకటించిన జాబితా ఫైనల్ కాదని ఓ మంత్రి చెబుతారు. రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇస్తామని మరొకరు చెబుతారు. అసలు లక్ష్యానికి దూరంగా .. గ్రామ సభలు పెట్టడానికి ఏ లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని నిర్వీర్యం చేసేలా మంత్రుల ప్రకటనలు ఉండటం ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గ్రామసభలు పెట్టినప్పుడు.. లబ్దిదారులను ఎంపిక చేసినప్పుడు తప్పనిసరిగా కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. పక్క వారికి ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగేవారు ఎక్కువ ఉంటారు. అర్హత ఉన్నా లేకపోయినా తాము పార్టీ సానుభూతిపరులం కాబట్టి ఇవ్వాల్సిందేనంటారు. పార్టీ సానుభూతిపరులు అయినా కాకపోయినా అలాగే చెప్పుకుంటారు. గ్రామాల్లోఉండే రాజకీయాలను అంచనా వేయకపోవడం తప్పిదమే. దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ఉపయోగించుకుంటోంది.