దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఎంవోయూలు భారీగా కుదుర్చుకుంది. లక్షన్నర కోట్లకుపైగా పెట్టుబడులను సాధించినట్లుగా ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యధిక అని ప్రకటించుకున్నారు. ఇందులో సన్ ఫార్మా దగ్గర నుంచి మేఘా వరకూ చాలా దేశీ కంపెనీల పెట్టుబడులు ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న ఆపీసుల్ని విస్తరిస్తామని ఒప్పందాలు చేసుకున్నాయి.
వీటిలో ఎన్ని పూర్తి స్థాయిలో వచ్చే ఏడాదికి గ్రౌండ్ అవుతాయో చెప్పడం కష్టం. గత ఏడాది కూడా రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు . ఆ ఒప్పందాల్లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయో ప్రభుత్వం వివరాలు ఇంకా బయట పెట్టలేదు. రేవంత్ ఇతర దేశాలకు వెళ్లినప్పుడల్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటనలు వస్తాయి. గత ఏడాది కాలంలో చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని అమల్లోకి వచ్చాయో ప్రజలకు క్లారిటీ ఇస్తే మరింత స్పష్టత ఉంటుంది.
హైదరాబాద్ తరుపుముక్క అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే పెట్టుబడులకు హైదరాబాదే కేంద్రం అవుతోంది. అన్ని రకాల ఇన్వెస్ట్ మెంట్ హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమలు.. దాని చుట్టు పక్కల పెట్టేవే ఉంటాయి. అయితే ఈ సారి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కోసం కూడా భారీ ఒప్పందం చేసుకున్నారు. ఎలా చూసినా హైదరాబాద్ ప్లస్ పాయింట్ గా రేవంత్ రెడ్డి పెట్టుబడుల ఆకర్షణ కోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు.