దావోస్లో పెట్టుబడుల ప్రకటనలకు చంద్రబాబు, లోకేష్ దూరంగా ఉన్నారు. ఓ ఎంవోయూ చేసుకుందాం అంటే.. సరే అనని పారిశ్రామిక వేత్త ఉండరు. కానీ చంద్రబాబు, లోకేష్ అలాంటి వాటికి దూరంగా ఉండాలని.. ఆర్భాటపు ప్రకటనల కన్నా అసలైన ఒప్పందాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను చూపించి.. వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దావోస్ కు వెళ్లి .. బినామీ కంపెనీలు అయిన అరబిందో రియాలిటీ, షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని వచ్చిన ఆయన చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగి వచ్చారని చెప్పుకొచ్చారు.
విశాఖలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించి అప్పటికే ప్రారంభమైన సంస్థల పెట్టుబడులను కూడా ఒప్పందాలుగా చూపించిన చరిత్ర వారిది. అలాంటి వారు ఇప్పుడు పెట్టుబడులు తేలేదు అని ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. చేయాలనుకుంటే.. ఏపీలో ఇటీవలి కాలంలో పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చిన ప్రతి ఒక్కరితో దావోస్ లో పెట్టుబడులు ఒప్పందాలు చేసుకునేవారు. కానీ ఆ పెట్టుబడులన్నీ గ్రౌండ్ కాకపోతే రేపు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎంవోయూలకు కాకుండా కేవలం వాస్తవ పెట్టుబడులకే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు,లోకేష్ నిర్ణయించుకున్నారు. విశాఖకు గూగుల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టీసీఎస్ వంటి సంస్థలు వస్తున్నాయి. కాగ్నిజెంట్ కూడా క్యాంపస్ పెట్టేందుకు అంగీకరించింది. అయితే ఆ పెట్టుబడిని దావోస్ లో ప్రకటించడం కన్నా ఏపీలో ప్రకటించాలని అనుకుంటోంది. దావోస్ టూర్ ప్రతిఫలాలు ముందు ముందు కనిపించబోతున్నాయి. ఆ ప్రకటనలు ఎక్కడో దావోస్ లో చేయడం కన్నా.. ఏపీలో చేస్తే వచ్చే కిక్ వేరుగా ఉంటుందని టీడీపీ నేతలు నిరూపించాలనుకుంటున్నారు.