సినిమా వాళ్ల లెక్కలు అంత తేలిగ్గా అర్థం కావు. ‘మా సినిమా రూ.200 కోట్లు కొట్టింది’ అని పోస్టర్ వేసుకొంటారు. కానీ నిజానికి ఆ సినిమాకు ఎంతొచ్చింది అనేది సినిమా తీసిన వాళ్లకే తెలుస్తుంది. ఫలానా హీరో పారితోషికం వంద కోట్లట అని అనుకొంటారు. కానీ ఎంత తీసుకొంటున్నాడో ఇచ్చిన వాళ్లకూ, హీరోకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ‘నా రెమ్యునరేషన్ ఇంత’ అని గొప్పగా, ధైర్యంగా చెప్పుకొనే హీరో, హీరోయిన్ ఒక్కడూ కనిపించడు. కారణం ఇన్ కం టాక్స్ ప్లాబ్లమ్.
ఇటీవల టాలీవుడ్ లో జరిగిన, జరుగుతున్న ఐటీ రైడ్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈస్థాయిలో ఎప్పుడూ ఐటీ శాఖ మన నిర్మాతలపై ఫోకస్ చేయలేదు. ఇప్పుడు చేయాల్సివచ్చింది. దాంతో మిగిలిన నిర్మాతలూ, హీరోలూ అలెర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మన హీరోల్లో చాలామంది ఏనాడో వైట్ లోకి మారిపోయారు. కాకపోతే.. జీఎస్టీ బాధ్యత నిర్మాతదే. ఉదాహరణకు ఓ హీరో రూ.50 కోట్ల పారితోషికం తీసుకొంటున్నాడనుకోండి. ఆ రూ.50 కోట్లూ నికరంగా నిర్మాత చెల్లించాల్సిన మొత్తం అన్నమాట. దానికి సరిపడా జీఎస్టీ కూడా సదరు నిర్మాతే భరించాలి. అంటే.. ఈ 50 కోట్లనీ హీరో వైట్ గా మార్చేసుకొంటున్నాడన్నమాట. అలాంటప్పుడు ఆ హీరోకి ఐటీ భయాలు ఎందుకు ఉంటాయి? కాబట్టే మన పెద్ద హీరోలంతా రిలాక్డ్స్గా ఉన్నారు. ఇక్కడ నలిగిపోతోంది నిర్మాత మాత్రమే.
ఇక వసూళ్ల లెక్కలంటారా? ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు తెగుతున్నాయి? ఎన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి… అనేది ఈ రోజుల్లో తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. టికెట్లన్నీ ఆన్ లైన్లో అమ్ముతుంటే, ఇక లెక్కలు దాచడానికి ఏముంటుంది? అయినా కూడా ‘మా సినిమాకు ఇంతొచ్చింది, అంతొచ్చింది’ అని ఫాల్స్ ప్రెస్టేజీ కోసం గొప్పలు పోతే.. ఐటీ వాళ్లు కాచుకొని కూర్చుంటారు. నిజానికి ఐటీ వాళ్లకూ తెలుసు.. ఈ లెక్కలన్నీ అచ్చు తప్పులే అని. కాకపోతే ఫార్మాలిటీ కోసం దాడులు నిర్వహించాల్సివస్తుంది. తెలుగు నిర్మాతలపై ఇన్నిసార్లు ఐటీ దాడులు జరిగినా ఎప్పుడెంత దొరికింది అనే లెక్కలెప్పుడూ బయటకు రాలేదు. నిర్మాతలకు వెనుక నుంచి ఆర్థిక సహాయం చేస్తున్న బినామీలు కూడా పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి కూడా ఇదే సీన్ పునరావృతం అవుతుందేమో చూడాలి.