ఏడాదిక్రితం అంటే చిరంజీవి రామ్ చరణ్ కోసం కథలు వింటున్నప్పుడు నా మిత్రుడైన సీనియర్ సినీ రచయిత ఒకరు ఆయనను కలిశారు. ఆ కథ నచ్చింది గాని దర్శకుడి కారణంగా మరో కథ ఎంచుకున్నారు. తర్వాత అది పరాజయం పాలైందనుకోండి. ఆ సమయంలోనే చిరంజీవి సినిమా కథ గురించి కూడా ఒకింత మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ రచయిత మెగాస్టార్‌కు కథ గురించి చిత్రీకరణ గురించి అపారమైన పట్టు వుందని నిర్ధారణకు వచ్చారు. మరో వైపు ఆయన ఒక పట్టాన కథ ఫైనలైజ్ చేసుకోలేరని కూడా అనుకున్నారు. సరే తర్వాత ఆయన తమిళం రీమేక్ ఎంపిక చేసుకుని మొదలుపెట్టారు. అందరూ సంతోషించారు. అయితే దీనికి ముందు ఆయన తను గతంలో వేసిన వేషాలు మరోసారి మేకప్‌లో చూసుకుని మీడియాకు కూడా విడుదల చేయాల్సిన అవసరం వుందా? చిరంజీవి డాన్సింగ్ గురించి గాని ఎనర్జీ గురించి గాని తెలుగు వారికి నిజంగా సందేహాలు లేవు. దీనికి కూడా ఒక ఉదాహరణ చెబుతాను. నాలుగేళ్ల కిందట చిరంజీవిని మా అబ్బాయి పెళ్లికి పిలవగానే గౌరవంగా వచ్చి చాలా సేపు గడిపారు. అక్కడున్న యువతతో ఫోటోలకు ఎంతో సమయం కూడా ఇచ్చారు. అప్పటికి ఆయన ఇంకా మంత్రి కాలేదు. నిజానికి ఆయన కన్నా ఎక్కువ పరిచయం వున్న కొందరు నేతలు రాలేదు గాని చిరంజీవి మాత్రం పార్క్ హయత్ హౌటల్‌కు వెళ్లవలసిన కార్యక్రమం కాస్త వాయిదా వేసుకుని వచ్చి వెళ్లారు. ఇంతకూ ఆ సమయంలో అందరినీ ఆకట్టుకున్న విషయం ఆయన చలాకీ తనమే. కొంతమంది మధ్య వయస్కులు ఆయన ఎనర్జీ లెవల్స్ చూసి తమకూ కళ్లు తెరుచుకున్యాన్నట్టు మాట్లాడారు. ఒకటి రెండేళ్లపాటు తెలుగుసినిమాను ఏకచ్చత్రంగా ఏలిన నటుడు మధ్యలో కొనేళ్ల విరామం వచ్చినంత మాత్రాన ప్రేక్షకులలో వేసిన ముద్ర ఎక్కడికిపోతుంది? అక్కినేనితో దాసరి ఎన్నోఏళ్ల తర్వాత తన తరహాలో తీసిన ప్రేమాభిషేకం ఎన్ని రికార్డులు సృష్టించింది? కనక కథ చిత్రీకరణ దర్శకత్వం వంటివి బాగాపండాలి గాని చిరంజీవి స్థాయి హీరోను ప్రేక్షకులు ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటారు. ఈ విషయమై లేనిపోని సందేహాలు ఆయనకు రావడం ఆశ్చర్యమే. ఒకవేళ సాధన కోసం సంతృప్తికోసం ఇలాటి పరీక్షలు పెట్టుకున్నా అవి బహిరంగ పర్చి ప్రచారం కోసం ఉపయోగించుకోవడం అసలే అవసరం లేనిపని. కళాకారులతో కవులు రచయితలతో అభిమానులను వుండే అనుబంధం సినిమా కథల్లో కన్నాచాలా బలంగా వుంటుంది. వూహకందనంత ప్రభావం చూపిస్తుంది. ఇకముందైనా మెగాస్టార్ ఈ తరహా రిహార్సల్స్ మానేస్తేనే బెటరు. లేకపోతే తానే సందేహాలు కలిగించినట్టవుతుంది.