డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమెజాన్ గిఫ్టుకార్డుల వల్ల నష్టపోతున్న అంశాన్ని తెరపైకి తెచ్చారు. చాలా మంది జనసేన దృష్టికి ఈ విషయాన్ని తీసుకు రావడం.. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయం కూడా ఇలా తమ పార్టీకి వచ్చిన గిఫ్టులు కార్డుల విరాళాలు కూడా ఎక్స్ పైర్ కావడం వల్ల ఈ సమస్య చిన్నది కాదని గుర్తించింది. అందుకే పవన్ కల్యాణ్ స్వయంగా ట్వీట్ చేశారు.
ఏ వాలెట్ లో అయినా డబ్బులు మురిగిపోవడం అనేది ఉండదు. కానీ అమెజాన్ లో మాత్రం గిఫ్టుకార్డుల కాలవ్యవధి ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవి ఉపయోగించుకోవడానికి ఉండదు. అమెజాన్ పే కూడా ఇప్పుడు ఎక్కువ ఆదరణ పొందుతోంది. పలుమార్గాల ద్వారా అమెజాన్ గిప్టు కార్డుల్ని చెలామణి చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది తమకు గిఫ్టుకార్డుల రూపంలో వచ్చిన నగదును ఏడాదిలోపు వినియోగించుకోపోవడం వల్ల నష్టపోతున్నారు. దీని విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జనసేన అభిమామనులు అమెజాన్ గిఫ్టులు కార్డు రూపంలో పార్టీకి విరాళాలిస్తున్నారు. వాటిని వాలెట్ లో ఉంచుతారు. అయితే ఏడాది తర్వాత అవి మురిగిపోతున్నాయి. స్వయంగా డబ్బులు కట్టి కొన్న కార్డుల్ని.. నగదుని అదేదో క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చిన డబ్బులు అన్నట్లుగా ఏడాది తర్వాత లేకుండా చేయడం ఏమిటన్న వాదనలు ఉన్నాయి. చాలా మందికి ఈ సమస్య సిల్లీగా అనిపించవచ్చు కానీ.. వందలకోట్ల వ్యవహారం అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పవన్ కల్యాణ్ ట్వీట్ తో అయినా అమెజాన్ స్పందించి.. అలాంటి నగదును వెనక్కి ఇప్పిస్తే లక్షల మందికి పోయిన డబ్బు తిరిగి వస్తుంది.