వైసీపీ అధినేత జగన్ కు పార్టీని ఎలా నడపాలో అర్థం కావడం లేదు. ఆయన ఎవర్నీ నమ్మడం లేదు.. ఆయనను ఎవరూ నమ్మడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం సోషల్ మీడియాలో అయినా ప్రచారం చేయడానికి అవసరం అని చెప్పి మళ్లీ ఐ ప్యాక్ తోనే మాట్లాడుకున్నారు. ఐ ప్యాక్ కు ఇప్పుడు ఖాతాల్లేవు. దాంతో మ్యాన్ పవర్ అంతా చెల్లా చెదురు అయిపోయారు. తాజాగా జగన్ రెడ్డి మళ్లీ పిలిచి కాంట్రాక్ట్ ఇవ్వడంతో రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు.
ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పటికి ఐ ప్యాక్ వేరు.. ఇప్పటి ఐ ప్యాక్ వేరు. ఏ మాత్రం అవగాహన లేని వివిధ మార్గాల ద్వారా డబ్బులు పిండుకుందామనే బ్యాచ్ ఇప్పుడు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవర్నో తిట్టించడమే స్ట్రాటజీ అనుకునే బ్యాచ్ ఉన్నారు. వారు వైసీపీని క్షేత్ర స్థాయిలో నిర్వీర్యం చేశారు. ఎన్నికల తర్వాత తమ బిచాణా ఎత్తేశారు. ఇస్తామని చెప్పిన డబ్బులు కూడా జగన్ ఇవ్వలేదన్న ఆరోపణలు వచ్చాయి. పలు సంస్థల్ని పరిశీలించి.. చివరికి తెలంగాణకు చెందిన ఓ వ్యక్తిని నియమించుకున్నా మార్పు ఏమీ లేకపోవడంతో మళ్లీ ఐ ప్యాక్ కు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ సారి కొత్త టీమ్ తో వస్తామని.. కొత్త ఐడియాలతో హోరెత్తిస్తామని వారు చెప్పడంతో జగన్ అంగీకరించారని అంటున్నారు.ఇప్పుడు వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. సోషల్ మీడియాలోనూ ఆ పార్టీకి మద్దతుగా పోస్టులు పెట్టేవారు లేరు. ఇక నుంచి ఐ ప్యాక్ టీమ్ తో అయినా ఆ పని చేయించాలని జగన్ అనుకుంటున్నారు.