ముఖ్యమంత్రిగా తాను పదేళ్లు ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా నమ్మకంగా చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా పదేళ్ల ప్రణాళికలు వేసుకుంటున్నారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఘంటా చక్రపాణికి యువతకు ఉద్యోగాలుకల్పించేలా పదేళ్లకు సరిపడా ప్రణాళికలు వేయమని చెప్పానని దాని ప్రకారం ఏం కావాలన్నా చేస్తామన్నారు. పదేళ్లు ఎందుకు.. ఐదేళ్లే కదా అధికారం అని ఎదురుగా కూర్చున్న వారికే కాదు టీవీల్లో చూస్తున్న వారికీ సందేహం వస్తుంది.
వారందరికీ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను ఖచ్చితంగా పదేళ్లు సీఎంగా ఉంటానన్నారు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవరికైనా పదేళ్ల సమయం ఇస్తోందన్నారు. ఎలా అంటే చంద్రబాబు రెండు టర్ములు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్కు కూడా రెండు టర్ములు చాన్సులు ఇచ్చారు. రెండో సారి పదవి చేపట్టిన కొద్ది నెలలకే వైఎస్ చనిపోయారు. అది వేరే విషయం. ఇక తర్వాత కేసీఆర్ కూడా టర్ములు చాన్సిచ్చారు. అంటే ఎవరు పదవి చేపట్టినా పదేళ్లు చాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తనకు కూడా రెండు టర్ములు అంటే పదేళ్లు చాన్స్ ఇస్తారని రేవంత్ నమ్మకం పెట్టుకున్నారు. ఈ లాజిక్ ప్రకారం చూస్తే రేవంత్ రెండో సారి సీఎం కావచ్చు.
మరో నాలుగేళ్లకు.. ఎన్నికలు వచ్చే నాటికి తాను చేపట్టిన పనులు మధ్యలో ఉన్నాయని.. మరో చాన్స్ ఇవ్వాలని రేవంత్ గట్టిగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. తాను ప్రజలకు మంచి చేశానని ఆయన చెప్పుకునేందుకు అప్పటికి చాలా పనులు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తీరు చూస్తూంటే.. ఆయన ఆషామాషీగా లేరని రెండో టర్ము గెలవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.