ఫిబ్రవరిలో బాక్సాఫీసు దగ్గర జోరు కనిపించబోతోంది. క్రేజీ సినిమాలు వరుస కడుతున్నాయి. ఫిబ్రవరి తొలి వారంలోనే ‘తండేల్’ వస్తోంది. ఆ తరవాత… లైలా, దిల్ రూబా, మజాకా, భైరవం… వరుసకడుతున్నాయి. అయితే ఈ సినిమాల్లో ‘తండేల్’, ‘మజాకా’లకే డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి.
‘తండేల్’ శాటిలైట్ జీ దక్కించుకొంది. ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతికి వెళ్లాయి. చైతూ కెరీర్లోనే ఖరీదైన సినిమా ఇది. దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని చిత్రబృందం చెబుతోంది. దానికి తగ్గట్టే నాన్ థియేట్రికల్ రైట్స్ కు మంచి రేటే గిట్టుబాటు అయ్యిందని తెలుస్తోంది. సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమాను రూ.20 కోట్లకు జీ కొనుక్కొంది. సందీప్‌కి ఇది మంచి బేరమే. అయితే ‘లైలా’, ‘దిల్ రూబా’, ‘భైరవం’ చిత్రాలు ఇప్పుడు నాన్ థ్రియేట్రికల్ రైట్స్ బేరాల్లో తలమునకలై ఉన్నాయి. ‘క’ తరవాత కిరణ్ ఫామ్ లోకి వచ్చాడు. కాబట్టి ‘దిల్ రూబా’కి పెద్దగా సమస్య ఉండకపోవొచ్చు. అయితే ‘లైలా’, ‘భైరవం’ చిత్రాలే తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ సినిమాల టీజర్లు వచ్చేశాయి. ట్రైలర్లు కూడా రిలీజ్ అయితే.. డిజిటల్ మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఏం చేసినా ఈ వారంలోనే జరిగిపోవాలి. డిజిటల్ మార్కెట్ క్లోజ్ అయితే గానీ, నిర్మాతలు గట్టున పడే అవకాశాలు కనిపించడం లేదు.