విజయసాయిరెడ్డి పొలం పనులు చేసుకుంటానంటూ రాజకీయ సన్యాసం చేసుకున్నారు. అయితే అదేదో సినిమాలో చెప్పినట్లు నేను రాజకీయాల్ని వదిలేసినా నన్ను రాజకీయాలు వదలేట్లేదన్న మాట ఇప్పుడు సాయిరెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన చాలా మంది రాజకీయ నేతల భవిష్యత్ ను తారుమారు చేయగల పొజిషన్ లో ఉన్నారు. ఆయన దగ్గర అంత సమాచారం ఉంది.
అబద్దాలు చెప్పను..అబద్దాలు చెప్పను అని విజయసాయిరెడ్డి ఎందుకు అంటున్నారో వైసీపీ నేతలకు అర్థం అయింది. ముఖ్యంగా అర్థం అవ్వాల్సిన వారికి అయి ఉంటుందని సెటైర్లు వినిపిస్తున్నాయి. చెప్పాల్సిన వస్తే మొత్తం నిజాలే చెబుతానని ఆయన సంకేతాలు పంపారు. దీంతో ఆయనకు ముందు ముందు వైసీపీ నుంచి చాలా సెగ తగలవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా సాక్షి మీడియా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు పెద్ద స్థాయిలో ప్రయత్నం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో తనపై జరగబోయే దాడిని విజయసాయిరెడ్డి ముందుగానే ఊహిస్తున్నారు. ఆయనకు ఏ మీడియా కూడా సపోర్టుగా ఉండదు. జగన్ మీడియానే దాడి చేస్తే ఆయన వాదన ఎవరు వినిపిస్తారు ?. అందుకే ఓ మీడియా పెట్టాలని సాయిరెడ్డి అనుకుంటున్నారు. దానికి సంబంధించిన పనులు అంతర్గతంగా చేసుకుంటున్నారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే.. సాయిరెడ్డి రాజకీయాల్ని వదిలేసినా.. ఆయనను మాత్రం రాజకీయాలు వదిలే అవకాశం లేదని అర్థం చేసుకోవచ్చు.