ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం ఖరారు అయింది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆయన ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయనున్నరాు. కూటమిలో మరో కీలక పార్టీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటన కూడా ఖరారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రెండు రోజులు ప్రచారం చేశారు. అక్కడ బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడు చనిపోవడం వల్ల ప్రచారం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయాలని బీజేపీ అగ్రనేతలు కోరడంతో చంద్రబాబు అంగీకరించారు. బడ్జెట్ రోజున ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. బీజేపీకి ప్రచారం చేయనున్నారు.
ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఓటర్లుగా ఉంటారు. మెజార్టీ ఉత్తరాదికి చెందిన వారు ఉంటున్నప్పటికీ దక్షిణాది వారు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. వివిధ వ్యాపారాలు, ఉద్యోగాల కోసం వెళ్లి దశాబ్దాల నుంచి అక్కడే స్థిరపడిపోయిన వారు ఉన్నారు. వారందర్నీ బీజేపీ కి ఓటేలా ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించనున్నారు. ఢిల్లీలో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్ట కుండా ప్రయత్నాలు చేస్తోంది.