కడప జిల్లాలో బెరైటీస్ గనులను జగన్ సోదరుడి వరుస అయిన వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తికి కేటాయించారు. దాదాపుగా రూ.వంద కోట్లు విలువైన ముగ్గురాయిని కేటాయించినట్లుగా వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో కేటాయించారని.. ఈ కేటాయిపు వెనుక టీడీపీకి చెందిన ఓ కీలక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ కు మేలు చేస్తున్నారన్న ప్రచారం జరగడానికి ఈ మైనింగ్ లీజు వ్యవహారం కారణం అవుతోంది. అయితే జగన్ తన సోదరుడికి కావాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మైనింగ్ లీజ్ ఇచ్చి ఉండేవారు. ఒక వేళ లీజు లేకపోయినా తవ్వుకుని పో తమ్ముడూ అని ఆఫర్ ఇచ్చి ఉండేవారు. కానీ అవేమీ జరగలేదు.
వైఎస్ వెంకటరెడ్డి గనుల కోసం 2016లోనే దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ముందుకు కదల్లేదు. జగన్ అధికారంలోకి వచ్చాక 2020లో ఫైలు ప్రతిపాదన పెట్టారు. కానీ గనులు మాత్రం కేటాయించలేదు. ఇప్పుడు టీడీపీ హయాంలో మాత్రం తొమ్మిదిన్నర హెక్టార్లలో మైనింగ్ కు అవకాశం ఇచ్చారు. అది పొడిగింపు కాదు… కొత్తగా ఇచ్చింది. అంతగా ఇవ్వాలనుకుంటే తన సోదరుడికి జగన్ ఇచ్చేవారు..కానీ ఇవ్వలేదు..?. ఎందుకు ?
జగన్ రెడ్డి బంధువులకు అధికారులు, కొంత మంది టీడీపీ నేతలు మేలు చేస్తున్నారన్న ప్రచారం జరగడానికి ఇలాంటి మైనింగ్ లీజుల కేటాయింపు దోహదం చేస్తోంది కానీ.. జగన్ లీజులు ఇవ్వలేదంటే.. సోదరుడితో కూడా సున్నం పెట్టుకున్నట్లే కదా. పులివెందులలో రాజకీయాలు ఇప్పుడు టీడీపీ నేతలకు చాలా కీలకం. ఈ కోణంలో జగన్ రెడ్డి కూడా ఇవ్వని లీజుల్ని ఆయన సోదరుడికి ఇస్తే.. ఆయన జగన్ రెడ్డి కోసం అనుకూలంగా పని చేస్తారా ? వ్యతిరేకంగా పని చేస్తారా ?. ఇలాంటి రాజకీయవ్యూహంలో భాగంగా లీజులు కేటాయించి ఉంటారు కానీ.. అధికారులు..కొంత మంది టీడీపీ నేతలు వైసీపీకి సహకరిస్తున్నట్లుగా ప్రచారం చేయడం మాత్రం.. టీడీపీకే నష్టం చేస్తుందని అనుకోవచ్చు.