తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. నిందితుల ఫోన్లను విశ్లేషిస్తున్న పోలీసులు అవసరమైనప్పుడల్లా కీలక సమాచారాన్ని వెలుగులోకి తెస్తున్నారు. వారం రోజుల కిందట బీజేపీ నేత త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ అయిందని గుర్తించిన అధికారులు… ఆ మేరకు మీడియాకు లీక్ ఇచ్చి.. కలకలం రేపారు. ట్యాపింగ్ కేసులో కేంద్రం కూడా బీఆర్ఎస్ పెద్దల్ని వదిలేసేందుకు .. ప్రయత్నించకూడదని.. తప్పించుకునేందుకు ప్రయత్నించకూడదన్న సంకేతాలు పంపారు.
తాజాగా న్యాయవ్యవస్థ కూడా వారిపై కనికరం చూపించకూడదని అనుకుంటున్నారేమో కానీ.. న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని లీక్ చేశారు. మొదట్లోనే ఓ జడ్జి దంపతుల ఫోన్లను ట్యాప్ చేశారని వెలుగులోకి తెచ్చారు. తాజాగా మరో ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. నిందితుల ఫోన్లు నుంచి గుర్తించినట్లుగా కోర్టుకు సీక్రెట్ నివేదిక సమర్పించారు. వారేమీ వివరాలు బయటకు తీశారో.. కూడా వెల్లడించారు. ఆ న్యాయమూర్తులపై ఎందుకు నిఘా పెట్టారో తేలాల్సి ఉంది.
ట్యాపింగ్ కేసు నిందితుల్ని అరెస్టు చేసి నెలలు గడిచిపోతోంది. అసలు నిందితుడు ప్రభాకర్ రావు వస్తే కేసులో అన్నీ బయటకు వస్తాయి. కానీ ఆయన రాకుండా అదృశ్యశక్తులు గట్టిప్రయత్నాలు చేస్తున్నాయి. ఏకంగా అమెరికాలోనే గ్రీన్ కార్డు ఇప్పించారని చెబుతున్నారు. ఆయనను రప్పించేందుకు కేంద్రం సాయం అవసరం. తాజాగా తిరుపతన్న కు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. ఇతరులు కూడా బయటకు వస్తే కేసు వీక్ అయిపోతుంది. అందుకే వారు కాకుండా… చాలా ప్రమాదకరమైన పనులు చేశారని.. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా లీక్ చేశారు. ఈ కేసును అంత తేలికగా వదలకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ఉందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయంటున్నారు.