విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు. నో బ్యాగ్ డే అంటే పిల్లలకు శనివారం స్కూల్ ఉంటుంది. కానీ బ్యాగులు, పుస్తకాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థులను పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహిస్తూ.. వారిపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు. అలాగే ఎప్పుడూ పాఠాలే కాకుండా… ప్రాక్టికల్స్ తరహాలో వివిధ రకాల పనుల్ని నేర్పించడం, విద్యార్థులకు ఆహ్లాదం నింపడం టార్గెట్ గా ఈ నో బ్యాగ్ డే నిర్వహిస్తున్నారు.
గతంలో కొన్ని ప్రభుత్వాలు నో బ్యాగ్ డే నిర్వహించాలని ప్రయత్నించాయి. కానీ సిరియస్ గా ప్రయత్నించకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి. దాంతో ఆ లక్ష్యం నెరవేరలేదు. నారా లోకేష్ మాత్రం ఏపీలో ఈ విధానాన్ని ఓ పక్కా ప్రణాళికతో అమలు చేయాలనుకుంటున్నారు. ఆ రోజున విద్యార్థులు బ్యాగులు తెచ్చుకోకపోయినా అంతకు మించి నేర్చుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమల్లోకి తీసుకురానున్నారు.
పుస్తకాల్లో ఏముందో చదవడమే కాదు..దాన్ని ప్రాక్టికల్ గా చేయగలిగే సామర్థ్యం వచ్చినప్పుడే పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది. ఇప్పటికే పిల్లలకు బ్యాగు సమస్య చాలా ఎక్కువగాఉంది. అపారమైన సిలబస్ తో పాటు చదువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీన్ని వీలైనంత వరకూ తగ్గించి..వారికి మెదడు మరింత చురుగ్గా ఉండేలా..శనివారం కార్యక్రమాలను ప్లాన్ చేసి.. నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు.