ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తోడబుట్టిన చెల్లిపై కోటి ఇరవై లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించి .. ఆమెను చంపేశాడు ఓ అన్న. ఆ కోటి ఇరవై లక్షలతో హాయిగా బతుకుదామనుకున్నాడు. కానీ దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.
పొదిలికి దగ్గరలోని కాటూరి వారి పాలెనికి చెందిన అశోక్ రెడ్డి, సంధ్య అన్నా, చెల్లెళ్లు. అశోక్ రెడ్డి పని పాటా లేకుండా తిరిగేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూంటారు. ఇటీవల అశోక్ రెడ్డి, సంధ్య పొదిలికి వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిది. అందులో సంధ్య చనిపోయింది కానీ.. అశోక్ రెడ్డికి పెద్దగా గాయాలు కాలేదు. తాము రోడ్డుపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి పోయిందని అశోక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐర్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
పోలీసులకు అనుమానం వచ్చి రోడ్డు ప్రమాదం పై ఆరా తీశారు. సంధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగాలేదని పోస్టుమార్టం రిపోర్టు రావడంతో.. అశోక్ రెడ్డిని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంధ్యను తానే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. కొద్ది నెలల క్రితమే సంధ్యపేరుపై కోటి ఇరవై లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చూపిస్తే ఆ కోటి ఇరవైలక్షలు వస్తాయనుకున్నాడు. అదే చేశాడు. కానీ ఇప్పుడు జైలుకెళ్లాడు.
తోడబుట్టిన చెల్లి కోసం ప్రాణాలిచ్చే అన్నల్ని చూశాం కానీ ఇలా ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేసే అన్నలు కూడా ఉంటారని అశోక్ రెడ్డి నిరూపించాడు.